పుల్వామా దాడిని సెల‌బ్రేట్ చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి.. 5 ఏళ్ల జైలు శిక్ష

Engineering Student Gets 5 Years In Jail For "Celebrating" Pulwama Attack.2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2022 4:44 AM GMT
పుల్వామా దాడిని సెల‌బ్రేట్ చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి.. 5 ఏళ్ల జైలు శిక్ష

2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఫేస్‌బుక్ పోస్ట్‌ లలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు 22 ఏళ్ల యువకుడికి ప్రత్యేక కోర్టు ఐదేళ్ల సాధారణ జైలుశిక్ష, రూ.25,000 జరిమానా విధించింది. అదనపు సిటీ సివిల్ & సెషన్స్ జడ్జి (NIA కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తి) న్యాయమూర్తి గంగాధర సిఎం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు ఫైజ్ రషీద్ కు నేరం జరిగినప్పుడు 19 ఏళ్లు. అతడు అప్పుడు కళాశాల విద్యార్థి.. మూడున్నరేళ్లుగా కస్టడీలో ఉన్నాడు.

ఫయాజ్ రషీద్ పుల్వామా దాడి జరిగిన అనంతరం ఫేస్ బుక్ లో ఉగ్రదాడిని సమర్థిస్తూ పోస్టు చేశాడు. దాంతో అతడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టు పెట్టాడని నిర్ధారణ కావడంతో స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. శిక్షాకాలంలో అతడు ఎలాంటి తప్పిదానికి పాల్పడినా మరో 6 నెలల అదనపు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రొబేషన్ సమయంలో సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయాలని రషీద్ తరపు న్యాయవాది కోర్టును కోరగా దేశభక్తులు వీరమరణం పొందిన సమయంలో సంబరాలు చేసుకోవడం చూస్తుంటే అతడు ఎలాంటివాడో తెలుస్తోందని న్యాయమూర్తి జస్టిస్ గంగాధర అభిప్రాయపడ్డారు. తప్పిదానికి పాల్పడిన సమయంలో అతడేమీ నిరక్షరాస్యుడో, సాధారణ వ్యక్తో కాదని, ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అని న్యాయస్థానం తెలిపింది.

మత ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ నిందితుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో అవమానకరమైన పోస్ట్‌లు చేశాడని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను సమర్పించిందని కోర్టు తన తాజా తీర్పులో పేర్కొంది. మత సామరస్యాన్ని దెబ్బతీయడమే కాకుండా.. ఇది ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

Next Story