ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ నియామకం
Eminent rocket scientist S Somanath appointed ISRO chief.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత
By M.S.R Published on 13 Jan 2022 2:35 PM IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త, రాకెట్ ఇం జనీరింగ్ నిపుణుడు ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. ఆయన తర్వాత ఇస్రోకి పదో చైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్(డీవోఎస్) కార్యదర్శిగా సోమనాథ్ నియామకం జరిగినట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన మూ డేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. సోమనాథ్ 2018 జనవరి 22 నుంచి విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్–1కు సంబంధించి క్రయోజనిక్ ఇంజన్ దశ సక్సెస్ అయ్యింది. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం విజయవంతంగా పరీక్షించారు. సుమారు 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకండ్లపాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఆశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతమైంది. గగన్‌యాన్–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజనిక్ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకండ్లపాటు మండించి పరిశీలన జరిపేందుకు మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. గగన్‌యాన్–1 ప్రోగ్రామ్ కోసం క్రయోజనిక్ ఇంజన్ అర్హతను పూర్తి చేయడానికి రెండు స్వల్పకాలిక పరీక్షలు, ఒక్క దీర్ఘకాలిక పరీక్ష చేయాల్సి ఉంది.