ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం.. ఎవరు ఎక్కువగా కొనుగోలు చేశారంటే?

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 March 2024 5:28 AM GMT
Electoral Bonds, Election Commission, ECI website

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం.. ఎవరు ఎక్కువగా కొనుగోలు చేశారంటే?

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఎలక్టోరల్‌ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లను పౌరులు లేదా సంస్థలు కొనుగోలు చేయవచ్చు. తద్వారా వచ్చిన నగదును బ్యాంకు సంబంధిత రాజకీయ పార్టీలకు అందజేస్తుంది. బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలు బాండ్లపై ఉండవు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏప్రిల్‌, 2019 నుంచి ఫిబ్రవరి, 2024 వరకు ఉన్న బాండ్ల డేటాను ఎస్‌బీఐ ఈసీకి సమర్పించింది.

2019 నుండి 2024 వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధికంగా సహకరించిన సంస్థల డేటాను వెల్లడిస్తూ భారత ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్లపై సమగ్ర డేటాను విడుదల చేసింది. ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్ నుండి బిలియనీర్ సునీల్ భారతి మిట్టల్ ఎయిర్‌టెల్, అనిల్ అగర్వాల్ వేదాంత సంస్థ, ITC, మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇలా ఎన్నో సంస్థలు ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసిన ప్రముఖులలో ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువుకు ఒకరోజు ముందుగా ఎన్నికల సంఘం గురువారం ఎలక్టోరల్ బాండ్ల డేటాను తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

1,368 కోట్ల రూపాయల విరాళాలతో శాంటియాగో మార్టిన్ నేతృత్వంలోని ప్రముఖ లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. రెండవ అతిపెద్ద దాత మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) నిలిచింది. కృష్ణారెడ్డి నేతృత్వంలో ఎంఈఐఎల్ 966 కోట్ల రూపాయల విలువైన విరాళాలు అందించింది.

హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక్కటే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.966 కోట్లు విరాళంగా ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ రూ. 80 కోట్లు, యశోధ హాస్పిటల్స్ రూ. 162 కోట్లు విరాళంగా అందించి టాప్ 10లో నిలిచాయి. మార్చి 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన ఫ్యూచర్ గేమింగ్, రెండు వేర్వేరు కంపెనీల సెట్ల క్రింద రూ.1,350 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసింది. వేదాంత లిమిటెడ్ రూ.398 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా, సునీల్ మిట్టల్‌కు చెందిన మూడు కంపెనీలు కలిపి మొత్తం రూ.246 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి.

లక్ష్మీ నివాస్ మిట్టల్ తన వ్యక్తిగత హోదాలో రూ.35 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. అనేక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కాంట్రాక్టులను దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ రూ.966 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. రాజకీయ పార్టీల పేరుతో చాలా బాండ్లు జారీ చేయగా, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీకి విరాళాలు 'అధ్యక్షుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ', 'అధ్యక్ష సమాజ్ వాదీ పార్టీ' పేర్లతో వచ్చాయి.

సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, ఎలక్టోరల్ బాండ్ల విక్రయదారుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 12న పోల్ ప్యానెల్‌తో డేటాను పంచుకుంది. మార్చి 15 సాయంత్రం 5 గంటల వరకు తన వెబ్‌సైట్‌లో డేటాను అప్‌లోడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు సమయం ఇచ్చింది. ఈ వివరాలను EC రెండు భాగాలుగా ఉంచింది -- ఒకటి కొనుగోలుదారుల జాబితా, మరొకటి లబ్ధిదారుల జాబితా. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏప్రిల్ 1, 2019- ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 మధ్య మొత్తం 22,217 వివిధ విలువలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేశారని, వాటిలో 22,030 బాండ్లను పార్టీలు రీడీమ్ చేశాయి.

పోల్ ప్యానెల్ అప్‌లోడ్ చేసిన డేటా ప్రకారం, ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారులలో స్పైస్‌జెట్, ఇండిగో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, టొరెంట్ పవర్, భారతీ ఎయిర్‌టెల్, డిఎల్‌ఎఫ్ కమర్షియల్ డెవలపర్లు, వేదాంత లిమిటెడ్, అపోలో టైర్స్, ఎడెల్‌వైస్, పివిఆర్, కెవెంటర్, సులా వైన్స్, వెల్స్పన్, సన్ ఫార్మా, వర్ధమాన్ టెక్స్‌టైల్స్, జిందాల్ గ్రూప్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, సియట్ టైర్లు, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ITC, కేపీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థలు ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్లను రీడీమ్ చేసిన పార్టీలలో BJP, కాంగ్రెస్, అన్నాడీఎంకే, BRS, శివసేన, TDP, YSR కాంగ్రెస్, DMK, JD-S, NCP, తృణమూల్ కాంగ్రెస్, JDU, RJD, AAP, సమాజ్ వాదీ పార్టీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, BJD, గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, JMM, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, జన సేన పార్టీ ఉన్నాయి.

ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సీజేఐ చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఎలక్టోరల్ బాండ్లపై కీలక తీర్పును ఇచ్చారు. ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, 2018 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. వాటిని జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఎస్‌బీఐని ఆదేశించింది.

లక్ష్మీ నివాస్ మిట్టల్‌తో పాటు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చిన వ్యక్తులలో కిరణ్ మజుందార్ షా, వరుణ్ గుప్తా, బి కె గోయెంకా, జైనేంద్ర షా, మోనికా అనే వ్యక్తులు ఉన్నారు. ఘజియాబాద్‌కు చెందిన యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 162 బాండ్‌లను కొనుగోలు చేసింది, ఒక్కోటి కోటి రూపాయల విలువ ఉంటుంది. . బజాజ్ ఆటో రూ.18 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.20 కోట్లు, మూడు ఇండిగో సంస్థలు రూ.36 కోట్లు, స్పైస్‌జెట్ రూ.65 లక్షలు, ఇండిగోకు చెందిన రాహుల్ భాటియా రూ.20 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు, హల్దియా ఎనర్జీ రూ.377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి.

అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం, మార్చి 2018 నుండి జనవరి 2024 వరకు రూ. 16,518 కోట్ల విలువైన మొత్తం 28,030 ఎలక్టోరల్ బాండ్‌లు విక్రయించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అత్యధికంగా రూ.6,566 కోట్లు .. అంటే 54.77 శాతం విరాళాలను అందుకోగా, కాంగ్రెస్ రూ.1,123 కోట్లు.. 9.37 శాతం, తృణమూల్ కాంగ్రెస్ రూ.1,092 కోట్లు.. అంటే 9.11 శాతం విరాళాలు అందుకున్నాయి.

Next Story