చేప‌ల వాస‌న వ‌స్తుంద‌ని బ‌స్సులోంచి మ‌హిళ‌ను దింపేసిన కండ‌క్ట‌ర్‌.. సీఎం ట్వీట్‌తో..

Elderly woman forced to get off bus over fish odour in Kanyakumari.చేప‌ల వాస‌న వ‌స్తుందంటూ ఓ బ‌స్సు కండ‌క్ట‌ర్ ఓ మ‌హిళ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2021 11:39 AM GMT
చేప‌ల వాస‌న వ‌స్తుంద‌ని బ‌స్సులోంచి మ‌హిళ‌ను దింపేసిన కండ‌క్ట‌ర్‌.. సీఎం ట్వీట్‌తో..

చేప‌ల వాస‌న వ‌స్తుందంటూ ఓ బ‌స్సు కండ‌క్ట‌ర్ ఓ మ‌హిళ‌ను బ‌స్సులోంచి దింపేశాడు. దీంతో త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆ వృద్దురాలు బ‌స్టాండ్‌లోనే ఆందోళ‌న‌కు దిగింది. త‌న ఊరికి న‌డిచి వెళ్లాలా అని త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కింది. దీన్ని ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఈ విష‌యం సీఎం దృష్టికి వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌పై సీఎం ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఆర్టీసీ అధికారులు బ‌స్సు డ్రైవ‌ర్‌తో పాటు కండ‌క్ట‌ర్‌పై చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలోని క‌న్యాకుమారి జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. చేప‌లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వృద్దురాలు కోలాచెల్ బ‌స్టాండ్ వ‌ద్ద బ‌స్సు ఎక్కింది. ఆమె వ‌ద్ద నుంచి చేపల వాస‌న వ‌స్తుండ‌డంతో.. కండ‌క్ట‌ర్ ఆమెను బ‌స్సులోంచి దించేశాడు. చాలాసేపు ఆమె బ్ర‌తిమిలాడినా కానీ వృద్దురాలిని బ‌స్సు ఎక్క‌నివ్వ‌లేదు. ఆర్టీసీ సిబ్బంది త‌న‌పై వివ‌క్ష చూపుతున్నారంటూ.. త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆమె బ‌స్టాండ్‌లోనే ఆందోళ‌న‌కు దిగింది. తాను వాణియ‌కుడికి న‌డిచి వెళ్లాలా..? అంటూ ప్ర‌శ్నించింది. ఓ వ్య‌క్తి దీన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఇది కాస్త సీఎం స్టాలిన్ దృష్టికి వెళ్లింది. కండ‌క్ట‌ర్ తీరుపై సీఎం ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు.

మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తున్న ఈ త‌రుణంలో ఓ వ్య‌క్తి చేసిన చ‌ర్య త‌ప్ప‌ని. అంద‌రం స‌మాన‌మే అనే విశాల దృక్ప‌థంతో మ‌నంద‌రం ఆలోచించి పని చేయాల‌ని సీఎం ట్వీట్ చేశారు. సీఎం ట్వీట్ చేయ‌డంతో రంగంలోకి దిగిన ఆర్టీసీ ఉన్న‌తాధికారులు ఆ కండ‌క్ట‌ర్‌తో పాటు డ్రైవ‌ర్‌ను స‌స్పెండ్ చేశారు. అంతేకాదు.. ర‌వాణాశాఖకు చెందిన ఓ ఉన్న‌తాధికారి బాధితురాలి వ‌ద్ద‌కు వెళ్లి క్ష‌మాప‌ణ‌లు తెలిపారు.


Next Story