80 ఏళ్ల పెద్దాయనకు.. రూ.80కోట్ల కరెంట్ బిల్లు.. ఆస్పత్రి పాలు
Elderly Nalasopara man taken to hospital after getting Rs 80 crore power bill.కరెంట్ బిల్లు చూసిన ఓ పెద్దాయన ఏకంగా ఆస్పత్రి పాలు
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2021 9:41 AM GMTకరెంట్ బిల్లు చూసిన ఓ పెద్దాయన ఏకంగా ఆస్పత్రి పాలయ్యాడు. ఇంతకీ ఆయనకి ఎంత బిల్లు వచ్చిందని అంటారా..? అక్షరాల 80కోట్ల రూపాయలు. అవును మీరు చదివింది నిజమే.. ఆయనకు ఏకంగా రూ.80కోట్ల బిల్లు వచ్చింది. అలా అని ఆయనకు పెద్ద పెద్ద బంగ్లాలు, కంపెనీలు ఏమీ లేవండి. ఆ బిల్లును చూసిన వెంటనే ఆ 80 ఏళ్ల పెద్దాయనకు గుండెలో కలుక్కుమంది. బీపీ పెరిగిపోవడంతో వెంటనే కింద కూలబడ్డాడు. ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పెద్దాయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని వాసాయి గణపత్ నాయక్(80) అనే వ్యక్తి రైస్ మిల్లు నడుపుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా రైలు మిల్లు మూతపడగా.. డిసెంబర్‌లో శుభ్రం చేసి తిరిగి ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి జనవరిలో కరెంట్ బిల్లు వచ్చింది. అది చూసి అతడికి షాక్ తగిలింది. ఆయనకు వచ్చిన బిల్లు రూ.80 కోట్లు (రూ.80,13,89,600) వచ్చింది. అంత మొత్తంలో బిల్లు ఎలా వచ్చిందో అర్థం కాలేదు..? ఎలా కట్టాలో అని ఆవేదన చెందుతూ కింద కూలబడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. ఆ పెద్దాయనకు అమాంతం బీపీ పెరిగిపోయిందని చెప్పారు.
గతంలో తాము అత్యధికంగా నెల బిల్లు కింద రూ.54 వేలు చెల్లించామని, ఇప్పుడిలా రూ.80 కోట్లు కట్టమని బిల్లు పంపించారని నాయక్ కుటుంబం వాపోతున్నది. ఈ బిల్లుపై ఎంఎస్‌ఈడీసీఎల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సురేంద్ర ముంగేర్ స్పందిస్తూ.. బిల్లు తయారీలో ఏదో తప్పు జరిగి ఉంటుందని చెప్పారు. మీటర్ రీడింగ్ ఏజెన్సీల తప్పిదం కారణంగా అలా వచ్చి ఉంటుందని, త్వరలోనే దీనిని మార్చి కొత్తది జారీ చేస్తామన్నారు.