మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే తనను అంతమొందించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించుకున్నారని శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ.. సంజయ్ రౌత్ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ పంపారు. ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలు పెరుగుతున్నాయని రౌత్ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తన భద్రతను ఉపసంహరించుకున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై తను ఎలాంటి ఫిర్యాదు చేయనని పేర్కొన్న రౌత్.. మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సంజయ్ రౌత్ లేఖపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. రౌత్ నాకు ఎందుకు అలాంటి లేఖ రాశాడు? భద్రత పొందడం కోసమా లేదా సంచలనం సృష్టించడం కోసం? ప్రతిరోజూ అబద్ధాలు చెప్పి సానుభూతి పొందలేరు. రుజువు లేకుండా ఆరోపణలు చేయడం తప్పు అని అన్నారు.
ఇదిలావుంటే.. తనపై నిఘా పెట్టి హత్యాయత్నం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తీవ్ర ఆరోపణ చేశారు. అశోక్ చవాన్ ఆరోపణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. నాపై నిఘా ఉంచి మెరుపుదాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రేకు నా పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. నాపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని అశోక్ చవాన్ అన్నారు. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని అశోక్ చవాన్ అన్నారు. నా పరువు తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై నాందేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.