రూ.357 కోట్ల రుణం ఎగవేత కేసు.. డీసీ ప్రమోటర్లకు షాకిచ్చిన ఈడీ
మనీలాండరింగ్, బ్యాంకు మోసం కేసుకు సంబంధించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిసిహెచ్‌ఎల్) మాజీ ప్రమోటర్లు
By అంజి Published on 14 Jun 2023 12:04 PM ISTరూ.357 కోట్ల రుణం ఎగవేత కేసు.. డీసీ ప్రమోటర్లకు షాకిచ్చిన ఈడీ
హైదరాబాద్: మనీలాండరింగ్, బ్యాంకు మోసం కేసుకు సంబంధించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డిసిహెచ్‌ఎల్) మాజీ ప్రమోటర్లు టి. వెంకట్రామ్ రెడ్డి, పికె అయ్యర్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం అరెస్టు చేసింది. ఇదే కేసులో కంపెనీ ఆడిటర్ మణి ఓమెన్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది. విచారణకు సహకరించడం లేదన్న ఆరోపణలతో ఈ ముగ్గురిని మంగళవారం ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత అరెస్టు చేసింది. వీరిని హైదరాబాద్‌లోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు .
2013లో, బ్యాంకుల కన్సార్టియం రుణాలు చెల్లించకపోవడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. 2015లో కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.357 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారనే ఆరోపణలపై వెంకట్‌రామ్‌రెడ్డి, ఆయన సోదరుడు, మరో ప్రమోటర్ టి.వినాయక్ రవిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.386 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
వెంకట్రామ్ రెడ్డి, అతని సోదరుడు టి వినాయకరవి రెడ్డి గ్రూప్ చేసిన రూ. 8,180 కోట్ల బ్యాంక్ రుణ మోసంతో సంబంధం కలిగి ఉన్నారు. అటాచ్ చేసిన ఆస్తులలో న్యూఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న 14 ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఏవీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ప్రక్రియ పరిధిలోకి రావని ఈడీ తెలిపింది.