ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. అభిజిత్‌సేన్‌కు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారని అభిజిత్ సేన్ సోదరుడు ప్రణబ్ సేన్ తెలిపారు.
బెంగాలీ కుటుంబానికి చెందిన అభిజిత్‌సేన్ స్టీఫెన్స్ కళాశాలలో ఫిజిక్స్ హానర్స్ చదివి కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ లో పీహెచ్‌డీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. నాలుగు దశాబ్ధాల పాటు విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్(Commission of Agricultural Cost and Prices)ఛైర్మన్ తో పాటు పలు పదవుల్లో ఆయన పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా సేవలందించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఆర్థిక రంగంలో అభిజిత్ సేన్ కృషిని కొనియాడారు.