ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై.. ఈసీ కీల‌క నిర్ణ‌యం

EC key decision on election victory rallies. ఎన్నికల విజ‌యోత్స‌వ ర్యాలీల‌పై మంగ‌ళ‌వారం నిషేదం విధించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 6:22 AM GMT
ellection rallies

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న త‌రుణంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నికల విజ‌యోత్స‌వ ర్యాలీల‌పై మంగ‌ళ‌వారం నిషేదం విధించింది. ఈ మేర‌కు ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతం సహా తమిళనాడు, కేరళ, అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తికాగా.. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మే 2న తేదీన ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే రోజు, ఆ త‌రువాత కూడా విజ‌యోత్స‌వ ర్యాలీను నిషేదించింది. ఎన్నిక‌ల్లో గెలిచిన అభ్యర్థులు ఎలాంటి సంబ‌రాలు నిర్వ‌హించొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. విజేత‌లుగా నిలిచిన అభ్య‌ర్థులు రిట‌ర్నింగ్ అధికారి నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు తీసుకునే స‌మ‌యంలో వారి వెంట ఇద్ద‌రుకు మించి ఉండ‌రాద‌ని ఆదేశించింది. ఓట్ల లెక్కింపులో కరోనా నియమ నిబంధనలను పాటించాలని.. ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డిలో భాగంగా అన్ని రాజ‌కీయ పార్టీలు, నాయ‌కులు ఈ నిబంధ‌న‌లను త‌ప్పనిస‌రిగా పాటించాల‌ని ఆదేశించింది.

కేంద్ర ఎన్నికల సంఘం వల్లే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే.రాజకీయ పార్టీలు భారీ ర్యాలీలు చేస్తున్నాయని, వాటిపై ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడం దారుణమని ఆక్షేపించింది. ఎన్నికల సంఘం ఉదాసీనత వల్లే కేసులు పెరిగిపోతున్నాయని మండిపడింది. ఈ నేపథ్యంలోనే ఈసీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Next Story