భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే.. చాలా పెట్రోల్ బంకుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు ఉన్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్న సమయంలో మోదీ ఫోటోను పెట్టి మీమ్స్ కూడా వచ్చాయి. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద ఉన్న మోదీ ఫోటోలను తొలగించాలని ఎలెక్షన్ కమీషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. పెట్రోల్ బంకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కేంద్ర పథకాల హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. హోర్డింగ్‌లను తొలగించేందుకు పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు, ఇతర ఏజెన్సీలకు 72 గంటలు సమయం ఇచ్చింది.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉప ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి.. పెట్రోల్ బంకుల్లో ప్రధాని మోదీ ఫొటోలతో ఉన్న హోర్డింగ్స్ గురించి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. మోదీ ఫొటోతో ఉన్న ప్రభుత్వ పథకాల ప్రచార హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని పెట్రోల్ బంకుల యాజమాన్యాలను ఆదేశించింది.