ఓ వైన్ షాప్.. రెండు కుటుంబాలు.. 15 గంటల వేలం.. రూ.510కోట్లు
E-auction of wine shop attracts bid of Rs 510 cr in Rajasthan.ఓ మద్యం షాపుకు నిర్వహించిన వేలం పాట ఇప్పుడు
By తోట వంశీ కుమార్ Published on 9 March 2021 11:10 AM GMTఓ మద్యం షాపుకు నిర్వహించిన వేలం పాట ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఏ రాష్ట్రాల్లోనైనా దాదాపు రూ.50లక్షల నుంచి రూ.80 లక్షలలోపే వైన్ షాప్ వేలం పాట ఉంటుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే..రూ.5కోట్ల లోపు ఉంటుంది. కానీ ఓ వైన్‌షాప్ ఏకంగా రూ.510 కోట్లు పలికిందంటే నమ్ముతారా..? అది కూడా రూ.72లక్షలతో బేస్ ప్రైస్‌తో మొదలైన పాట అన్ని కోట్లకు చేరింది. దాదాపు 15 గంటల పాటు ఈ వేలం పాట సాగింది. ఉదయం 11గంటలకు మొదలైన పాట అర్థరాత్రి 2 గంటలకు ముగిసింది. ఎందుకు అంతలా పాడారు. ఆ షాపు నుంచి అంత ఆదాయం వస్తుందా..? అంటే అదేమీ కాదట. రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం కారణంగానే పాట అంతలా దూసుకుపోయిందని అంటున్నారు.
రాజస్థాన్‌లోని హనుమాన్ గఢ్ జిల్లాలోని నోహర్‌లోని ఓ వైన్‌షాప్‌కు ఈ-వేలం వేశారు. కిందటి సారి లాటరీలో కేవలం రూ.65లక్షలకే ఈ వైన్‌షాపు అమ్ముడుపోయింది. ఉదయం 11 గంటలకు రూ.72 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలం పాట ప్రారంభమైంది. ఓ రెండు కుటుంబాలు ఈ షాపు కోసం పోటి పడ్డారు. ఇరు కుటుంబాల మధ్య వైరం ఉండడంతో ఎవ్వరూ తగ్గలేదు. క్రమంగా లక్షల నుంచి కోట్లకు చేరింది వేలం పాట. అయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. చివరకు అర్థరాత్రి 2 గంటలకు రూ.510 కోట్ల వద్ద వేలం ముగిసింది. కిరణ్ కన్వర్ అనే వ్యక్తి ఈ షాప్‌ను సొంతం చేసుకున్నట్లు ఎక్సైజ్ పాలసీ అడిషనల్ కమిషనర్ సీఆర్ దేవసి వెల్లడించారు.
బేస్‌ప్రైస్ కంటే ఇది ఏకంగా 708 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మూడు రోజుల్లో ఈ బిడ్డింగ్ మొత్తంలో రెండు శాతాన్ని బిడ్డర్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అతడు చెల్లించలేకపోతే రూ.లక్ష డిపాజిట్‌ను తిరిగి ఇవ్వరు. చురు జిల్లాలోని ఓ వైన్ షాప్ రూ.11 కోట్లకు, జైపూర్‌లోని సాంగనర్ వైన్‌షాప్ రూ.8.91 కోట్లు పలికాయి. ఇటీవలే..రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం వైన్‌షాప్‌లను లాటరీలో కాకుండా వేలం వేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కారణంగా అక్కడి ప్రభుత్వంపై కాసుల వర్షం కురుస్తోంది.