బుర్జ్‌ ఖలీఫా థీమ్‌తో.. ప్రత్యేక ఆకర్షణగా దుర్గమాత మంటపం..!

Durga pandal in Kolkata replicates Dubai's Burj Khalifa.గణేష్‌ నవరాత్రులు ముగిసాయే లేదో... రానే వచ్చింది దుర్గమ్మ

By అంజి  Published on  7 Oct 2021 6:33 AM GMT
బుర్జ్‌ ఖలీఫా థీమ్‌తో.. ప్రత్యేక ఆకర్షణగా దుర్గమాత మంటపం..!

గణేష్‌ నవరాత్రులు ముగిసాయే లేదో... రానే వచ్చింది దుర్గమ్మ నవరాత్రుల సంబరాలు. దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దుర్గ మంటపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక దుర్గమ్మ ఆలయాలు ప్రత్యేక పూజలతో ఆధ్మాత్మిక శోభను సంతరించుకున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కలకత్తా కాళీ ఆలయాన్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కోల్‌కతాలో ప్రతి ఏటా దసరా సందర్భంగా వివిధ ఆకృతుల్లో దుర్గమ్మ పూజ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది లేక్‌టౌన్‌లో దుర్గా పూజ మంటపాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా టవర్‌ని ప్రతిబింబించేలా తీర్చి దిద్దారు. ప్రతి సంవత్సరం ఐకానిక్‌ భవనాలను ప్రతిబింబించేలా దుర్గ మంటపాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సుజిత్ బోస్‌ తెలిపారు. గత నవరాత్రుల్లో పారిస్‌లోని ఒపెరా, పూరీ జగన్నాథ ఆలయం, కేదార్‌నాథ్‌ ఆలయాల మాదిరిగా మంటపాలను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సారి ఏర్పాటు చేసిన బుర్జ్‌ ఖలీఫా టవర్‌ థీమ్‌ను 145 అడుగుల ఎత్తు వరకు నిర్మించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ టవర్ రాత్రి సమయంలో వెలుగులు విరజిమ్ముతుందని అక్కడి నిర్వాహణ అధికారి ఒకరు తెలిపారు. దీని కోసం స్పెషల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. దీని నిర్మాణం కోసం 250 మంది కార్మికులు 2 నెలలు శ్రమించారని తెలిపారు.

Next Story