ఆరేళ్ల జైలు శిక్ష తర్వాత.. ప్రొఫెసర్ సాయిబాబకు కోర్టులో ఊరట
DU former professor Dr Gokarakonda Naga Saibaba got relief. ఎట్టకేలకు ఆరేళ్ల జైలు శిక్ష తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ గోకరకొండ నాగ సాయిబాబాకు ఊరట లభించింది.
By అంజి Published on 14 Oct 2022 2:53 PM ISTఎట్టకేలకు ఆరేళ్ల జైలు శిక్ష తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ గోకరకొండ నాగ సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టు సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అతడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 2017లో ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది.
శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. దోషులు మరే ఇతర కేసులో నిందితులుగా ఉన్నట్లయితే వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై, 2017 మేలో ప్రొఫెసర్ సాయిబాబా, జర్నలిస్టు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి, మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.
2017లో గడ్చిరోలి ట్రయల్ కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుండి, వారు నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే జీవిత ఖైదును సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, 2014లో ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేయడంతో ఢిల్లీ యూనివర్శిటీ సస్పెండ్ చేసింది. గతేడాది అతడిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించింది. ఈ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారా లేదా అనేది తెలియదు. మావోయిస్టు సంబంధాల కేసులో నిర్దోషిగా విడుదలైన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సతీమణి ఏఎస్ వసంత కుమారి శుక్రవారం ఆయన మద్దతుదారులకు, న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.