మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ నేపథ్యంలో 2021కి వీడ్కోలు పలుకుతూ 2022 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్దం అవుతున్నారు. మరో వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. నేటి వరకు దేశ వ్యాప్తంగా 358 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. మరోసారి దేశంలో కరోనా విజృంభించకుండా అవసరం అయితే రాత్రి కర్ఫ్యూ, కంటైన్‌మెంట్ జోన్ లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మద్యానికి గిరాకీ ఎక్కువ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నెల 24,25 తేదీలతో పాటు కొత్త సంవత్సరం రోజు అంటే జనవరి 1న మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించి మందుబాబులకు షాక్ ఇచ్చింది. అయితే.. ఈ నిషేదం రాష్ట్రం మొత్తం కాకుండా ఈస్ట్ ఖాసి జిల్లాలో మాత్రమే ఉండనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇప్పటికే వెలువరించింది.