విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. మద్యం మత్తులో..

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మద్యం మత్తులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.

By అంజి  Published on  5 March 2023 5:07 AM GMT
Drunk flyer, American Airlines

విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (ఫైల్‌ ఫొటో)

ఎయిరిండియా విమానంలో మూత్ర విసర్జన ఘటన ఎంత చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలుసిందే. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ రిపీట్‌ అయ్యింది. అయితే ఈ సారి అమెరికల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఈ ఘటన జరిగింది. న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మద్యం మత్తులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయం వర్గాలు తెలిపాయి.

AA292 అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం రాత్రి 9:16 గంటలకు న్యూయార్క్ నుండి బయలుదేరింది. 14 గంటల 26 నిమిషాల తర్వాత శనివారం రాత్రి 10:12 గంటలకు ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. నిందితుడు యూఎస్ యూనివర్శిటీలో విద్యార్థి అని, అతను తాగిన మత్తులో నిద్రపోతున్నప్పుడు మూత్ర విసర్జన చేశాడు. "ఇది ఎలాగో లీక్ అయి, సిబ్బందికి ఫిర్యాదు చేసిన తోటి ప్రయాణీకుడిపై పడింది" అని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

విద్యార్థి క్షమాపణలు చెప్పాడు. బాధితుడు ఈ విషయాన్ని పెద్దది చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే, సిబ్బంది సంఘటన గురించి తెలుసుకున్నారు. వారు పైలట్‌కు సమాచారం అందించారు, అతను దానిని ఐజిఐ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి తెలిపాడు. ఏటీసీ సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

నవంబర్ 2022లో న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఒక వృద్ధ మహిళపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన జరిగిన నెలల తర్వాత ఇది జరిగింది. నెల రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మిశ్రాను అరెస్టు చేసి, దాదాపు నెల రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఘటన జరిగిన 12 గంటల్లోగా విషయాన్ని తెలియజేయనందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. మిశ్రాపై నాలుగు నెలల పాటు విమానయాన నిషేధం కూడా విధించారు .

Next Story