15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

Droupadi murmu takes oath as 15th President of India. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.

By అంజి  Published on  25 July 2022 10:38 AM IST
15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. ద్రౌపది చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, మంత్రిమండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము.. మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అటునుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో కలిసి ద్రౌపది ముర్ము పార్లమెంటుకు ఊరేగింపుగా వచ్చారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. ''రాష్ట్రపతి పదవికి చేరుకోవడం నా వ్యక్తిగత విజయం కాదు. ఇది భారతదేశంలోని ప్రతి పేదవాడి ఘనత. భారతదేశంలోని పేదలు కలలు కనడమే కాకుండా ఆ కలలను కూడా నెరవేర్చుకోగలరనడానికి నా నామినేషన్ సాక్ష్యం'' అని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించి దేశానికి తొలి రాష్ట్రపతిని అయిన వ్యక్తిని తానేనన్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని పేదలు, దళితులు, వెనుకబడిన, గిరిజనులు తనను ప్రతిబింబంగా చూడటం తనకు సంతృప్తినిస్తోందన్నారు. తన నామినేషన్ వెనుక పేదల ఆశీస్సులు ఉన్నాయని, ఇది కోట్లాది మంది మహిళల కలలు, సామర్థ్యాలకు ప్రతిబింబం అని ముర్ము పేర్కొన్నారు.

జార్ఖండ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా పనిచేసిన ముర్ము, 2015 నుండి 2021 వరకు ఆ పదవిలో పనిచేశారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన రెండవ మహిళ ముర్ము. ఒడిశాలోని వెనుకబడిన జిల్లా మయూర్‌భంజ్ గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో ముర్ము జన్మించారు. ముర్ము అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తన చదువును పూర్తి చేసుకున్నారు. ఆమె శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్, రాయంగ్‌పూర్‌లో బోధించారు. ద్రౌపది ముర్ము 6,76,803 విలువతో 2,824 ఓట్లను పొందగా, ఆమె ప్రత్యర్థి యశ్వంత్ సిన్హా 3,80,177 విలువతో 1,877 ఓట్లు సాధించారు. జూలై 18న జరిగిన పోలింగ్‌లో మొత్తం 4,809 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు.


Next Story