తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్.. ఇక సైన్యానికి మ‌రింత సౌక‌ర్య‌వంతం

DRDO develops new lightweight bullet-proof jacket. భారత సైన్యం కోసం తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న డీఆర్‌డీవో కృషి ఫలించింది.

By Medi Samrat  Published on  2 April 2021 6:41 AM GMT
bullet proof jacket

తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇది ఒక కల.. కల అని ఎందుకు అన్నానంటే.. తేలిక, బుల్లెట్ ప్రూఫ్ అనేవి ఒకవిధంగా చెప్పాలి అంటే వ్యతిరేక పదాలు. అయితే ప్రస్తుతం భారత సైన్యం కోసం తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న డీఆర్‌డీవో కృషి ఫలించింది. అత్యుత్తమ నాణ్యతతో, 9 కేజీల బరువు ఉండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కు చెందిన కాన్పూరులోని ప్రయోగశాల అభివృద్ధి చేసింది.

ఫ్రంట్‌హార్డ్ ఆర్మర్ ప్యానెల్ జాకెట్‌గా పిలిచే దీనిని చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లేబొరేటరీలో పరీక్షించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు తేల్చారు. అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేకమైన మెటీరియల్స్ వాడడం వల్ల గతంలో 10.4 కేజీల బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇప్పుడు 9 కిలోలకు తగ్గినట్టు అధికారులు తెలిపారు. తేలిక పాటి జాకెట్‌ వల్ల సరిహద్దుల్లో సైన్యానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని డీఆర్‌డీవో పేర్కొంది. ఈ ఘనత సాధించినందుకు శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు.

Advertisement

గతంలో డీఆర్‌డీవో ద్రవంతో నిండిన స్పెషల్ జాకెట్లను అభివృద్ధి చేసింది. వీటిని ధరించిన వారు వేడిని తట్టుకోగలుగుతారు. జోధ్‌పూర్ ఆరోగ్య శాఖ గతేడాది జులైలో ల్యాబ్ టెక్నీషియన్లకు వీటిని అందజేసింది. అలాగే, ఇండియన్ ఆర్మీలో మేజర్ ర్యాంకు అధికారి అనూప్ మిశ్రా ఈ ఏడాది జనవరిలో స్త్రీ, పురుషులు ధరించగలిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ 'శక్తి'ని అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ఫ్లెక్సిబుల్ బాడీ ఆర్మర్ కావడం విశేషం.

Advertisement

Next Story
Share it