ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్ ఉంది.. ఎక్కడో కాదు, మన దేశంలోనే. హిమాచల్ ప్రదేశ్‌లోని హిక్కిం గ్రామంలో ఈ పోస్టాఫీస్ ఉంది. 1983లో భారత తపాలా శాఖ ఈ పోస్టాఫీస్‌ను ప్రారంభించింది. హిమాలయ పర్వతాల మధ్యలో సముద్రమట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న పోస్టాఫీస్‌గా పేరు గాంచింది. అక్కడికి చేరుకోవాలంటే ఎముకలు కొరికే చలిలో ప్రమాదకరమైన దారుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ పోస్టాఫీస్ చుట్టుపక్కల ఐదు గ్రామాలు ఉంటాయి. అక్కడ మొబైల్ సిగ్నల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంటర్ నెట్ అయితే అసలే ఉండదు. దీంతో అక్కడి గ్రామస్థులు లెటర్స్, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసుకోవడానికి ఈ పోస్టాఫీస్‌కే వస్తుంటారు.
ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఆ పోస్టాఫీసు నుంచి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉత్తరాలు పంపించుకుంటారు. ఇలా ఉత్తరాలు పంపించుకోవడం ఒక గొప్ప అనుభూతిగా టూరిస్టులు భావిస్తారు. ఆ పోస్టాఫీస్‌లో ఇద్దరు పోస్టుమెన్‌లు పని చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం ఉత్తరాలను ఆ ఫోస్టాఫీస్ నుంచి కాజా పట్టణానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఉత్తరాలను పంపుతారు. మంచు ఎక్కువగా పడుతున్న సమయాల్లో ఈ పోస్టాఫీస్‌ను మూసివేస్తారు.