ఉప్పు ఎడారి.. 'రాన్ ఆఫ్ కచ్' గురించి ఈ విషయాలు తెలుసా?
Do you know these things about Rann of Kutch?. భారతదేశంలో ఎన్నో వింత ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్
By అంజి Published on 12 Feb 2023 11:00 AM GMTభారతదేశంలో ఎన్నో వింత ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్. ఇక్కడి ఉప్పు కయ్యలు, బీచ్‌లు పర్యాటకుల మనసును ఎంతగానో ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం 3 నెలల పాటు రాన్ ఉత్సవ్ జరుగుతుంటుంది. ఈ ఉత్సవం పర్యాటకులని ఎంతోగానో ఆకట్టుకుంటుంది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులా విస్తరించి ఉందీ.. ఈ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం. విస్తీర్ణ పరంగా ఎక్కువ భాగం భారత్‌లోనే ఉంది. 26,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఈ ఏడారికి ఉత్తరాన థార్ ఎడారి, దక్షిణాన పర్వత శ్రేణులు, పశ్‌చిమాన సింధు నది డెల్టా ఉటుంది.
విస్తారమైన ఈ తెల్లటి ఎడారిలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు కళ్లను మిరుమిట్లు గొలుపుతాయి. తదేకంగా చూస్తే కళ్లు చెదరాల్సిందే. చందమామ వెలుతురులో చల్లని వాతావరణంలో ఎడారిలోని గుడారాల్లో చేసే రాత్రి విడిది.. టూరిస్ట్‌లకు మధురానుభూతిని ఇస్తుంది. కుట్లు, అలికల్లో కళ్లు చెదిరే నైపుణ్యం ఇక్కడి మహిళల సొంతం. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు తప్పకుండా కచ్ వర్క్ దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి ఆడవాళ్ల సృజనాత్మకతకు.. తామేమీ తీసిపోం అన్నట్లుగా ఇక్కడి పురుషులు చేసే కలప వస్తువులకు అద్భుతంగా ఉంటాయి. రాన్ ఆఫ్ కచ్‌కి వెళ్లాలనుకునే వారు.. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వెళ్తే సరి. ఇక్కడి అక్కడి వాతావరణానికి అనుకూలమైన సమయం
రాన్ ఉత్సవ్
గుజరాత్ ప్రభుత్వం రాన్ ఆఫ్ కచ్‌ని టూరిజం పరంగా అభివృద్ధి చేసి, ఏటా ఇక్కడ రాన్ ఉత్సవన్‌ను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు అక్టోబర్‌లో మొదలై ఫిబ్రవరితో ముగుస్తాయి. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. ఓపెన్ టాప్ బస్సులో సాగే ఇక్కడి రన్ సఫారీ మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇక పర్యాటకులు ఈ ప్రకృతి దృశ్యాలను తమ కెమెరాల్లో జ్ఞాపకాలుఉగా మార్చుకుంటుంటారు. వైట్ రాన్‌కు దగ్లర్లోని రాక్ క్లైంబింగ్, పారా సైలింగ్, ర్యాపెలింగ్ వాల్ వంటి సాహస క్రీడలు కూడా ఉంటాయి. ఇక్కడి జైనుల ఆలయాలు, మసీదులు, మ్యూజియంలన్నీ టూరిస్ట్‌లను ఆకట్టుకుంటాయి.