మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
DMK MLA Suicide attempt I.. డీఎంకేలో వర్గపోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నానికి
By సుభాష్ Published on 21 Nov 2020 8:08 AM ISTచెన్నై: డీఎంకేలో వర్గపోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్షమాపణలు చెప్పినా కనికరించనందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం శుక్రవారం తిరునెల్వేలి నుంచి చెన్నైకి తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. తెన్‌కాశీ జిల్లా ఆలంగుళం అసెంబ్లీ నియోజకవర్గానికి పూంగోదై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె దివంగత మంత్రి ఆవడి అరుణ కుమార్తె. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పూంగోదై సాంఘిక సంక్షేమ మంత్రిగా పని చేశారు. 2011,2016లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈనెల 18న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్యాయత్నానికి కారణాలివేనా..?
ఆలంగుళం నియోజకవర్గ సమస్యలపై ఈనెల 18న తిరుమలైపురంలో జరిగిన ఓ సమావేశానికి పూంగోదై అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. గెలుపొందిన తర్వాత నియోజకవర్గం వైపే రావడం లేదని ఈ సమయంలో పార్టీ నేత ఒకరు ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేలపై బైఠాయించారు. దీంతో పార్టీ నేతల కాళ్లపై పడి ఆమె క్షమాపణ వేడుకున్నారు. తన పరిస్థితి వివరించేందుకు పూంగోదై వేదికపైకి వెళ్లగానే మైక్ కట్ చేశారు. స్టాలిన్‌కు ఫిర్యాదు చేస్తానని కారులో వెళ్లిపోయారు. తండ్రి మరణం తర్వాత ఆస్తితగాదాలు చోటు చేసుకుని తమ్ముడు ఎళిల్‌వానన్‌తో విబేధాలు ఏర్పడ్డాయి. అయితే పోలింగ్ బూత్ సమావేశాల్లో పార్టీ నేతలు ఎళిల్‌వాననన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎళిల్‌వానన్‌కు సీటిచ్చే అవకాశం ఉండటంతో తీవ్ర కుంగుబాటులో గురైనట్లు తెలుస్తోంది. కాగా, ఆత్మహత్యాయత్నం తర్వాత తిరునెల్వేలోని ఓ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విమానంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే తాను ఆత్మహత్యకు పాల్పడలేదని పూంగోదై శుక్రవారం మీడియాతో చెప్పడం గమనార్హం.