'కళ్లకురిచి ఘటన వెనక అన్నామలై కుట్ర'.. డీఎంకే నేత సంచలన ఆరోపణ
తమిళనాడులోని కల్లకురిచి హూచ్ ఘటనలో జరిగిన విషాద మరణాలకు బీజేపీయే కారణమని డీఎంకే ఆరోపించింది.
By అంజి Published on 23 Jun 2024 9:30 PM IST
'కళ్లకురిచి ఘటన వెనక అన్నామలై కుట్ర'.. డీఎంకే నేత సంచలన ఆరోపణ
తమిళనాడులోని కల్లకురిచి హూచ్ ఘటనలో జరిగిన విషాద మరణాలకు బీజేపీయే కారణమని డీఎంకే ఆరోపించింది. అక్రమ మద్యం ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే మిథనాల్‌ను బీజేపీ నేతృత్వంలోని కూటమి పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి నుండి సేకరించారని పేర్కొంది. డీఎంకే నేత ఒకరు ఈ ఘటనను అన్నామలై ప్లాన్ చేసిన కుట్రగా అభివర్ణించారు. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో జూన్ 18న కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించారు. విలేకరుల సమావేశంలో డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి ఈ ఘటనకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలైని నిందించారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నామలై గతంలో చేసిన డిమాండ్‌పై భారతి ఆరోపణలు వచ్చాయి. ఇండియా టుడే టీవీతో మాట్లాడిన అన్నామలై ఎంకే స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు.
ఇంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారా? ఆత్మపరిశీలన చేసుకోండి అని సూచించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, భారతి "ఎవరైనా రాజీనామా చేయవలసి వస్తే, అది వారి (బిజెపి) మంత్రులు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి అని. ముడిసరుకు అక్కడి నుండి వచ్చాయని, బిజెపి బాధ్యులని, వారు చేశారని మాకు పోలీసులు చెబుతున్నారు. ఇది అన్నామలై చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్ర అని నేను అంటున్నాను, ఇది ఎన్నికలకు ముందు జరిగిందా? అనే సందేహం ఉంది'' అని అన్నారు.
గతంలో జరిగిన ఘటనలకు బీజేపీ నేతలు, మంత్రులను బాధ్యులను చేశారా? అని భారతి ప్రశ్నించారు. "డార్జిలింగ్ రైలు ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి రాజీనామా చేశారా? నీట్‌ను కొట్టివేసిన కుట్రలకు కేంద్ర మంత్రి రాజీనామా చేశారా? 2009లో కల్తీ మద్యం తాగి 137 మంది చనిపోతే నరేంద్ర మోడీ రాజీనామా చేశారా?" అని ఆర్ ఎస్ భారతి ప్రశ్నించారు.
కళ్లకురిచి హూచ్ విషాదం
జూన్ 18న, కళ్లకురిచి జిల్లాలోని కరుణాపురం నుండి చాలా మంది పురుషులు, ఎక్కువగా రోజువారీ కూలీ కార్మికులు, ప్యాకెట్లు, సాచెట్‌లలో విక్రయించే నకిలీ మద్యాన్ని సేవించారు. రాత్రి సమయానికి, వారిలో చాలా మందికి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, కళ్ళలో చికాకు వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. ఈ ఘటనలో మొత్తం 53 మంది మరణించగా, డజన్ల కొద్దీ వారి పరిస్థితి విషమంగా ఉంది. 'మిథనాల్ కలిపిన అరక్' తాగడం వల్లే మరణాలు సంభవించాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. కల్తీ మద్యం విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు.