కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె వివాహం ఆదివారం బెంగళూరులో జరిగింది. శివ కుమార్ కుమార్తె ఐశ్వర్య.. కేఫ్ కాఫీ డే యజమాని దివంగత సిద్ధార్థ్ హెగ్డే కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహమాడారు. ఈ వేడుకకు డీకే శివకుమార్, ఎస్.ఎం.కృష్ణ తరఫు బంధువులు, వేర్వేరు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. డీకే శివకుమార్, దివంగత సిద్ధార్థ్ హెగ్డే మంచి మిత్రులు. బంధువులుగా మారాలన్న వారి కల ఈ వివాహంతో నెరవేరింది.
ఇదిలావుంటే.. సిద్దార్థ.. కాఫీ తోటల యజమాని కొడుకుగా పుట్టి కాఫీ కింగ్‌గా ఎదిగారు. 1983లో మంగళూరు యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాక కర్ణాటకలోని చిక్‌మంగళూరులో జేఎం ఫైనాన్షియల్‌లో సిద్దార్థ మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. 1992లో తొలిసారిగా ఆయన కాఫీ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అప్పట్లో కాఫీ గింజలను సేకరించడం.. వాటిని ప్రాసెసింగ్ చేయడం.. ఆపై విక్రయాలు జరపడం చేసేవారు. అలా అనతికాలంలోనే బ్రాండ్ వాల్యూ ఇంటర్నేషనల్ దాకా ఎదిగింది.
అలా ఆ సంస్థ ఆదాయం 2018లో రూ.2016కోట్లకు చేరుకుందంటే సిద్దార్థ కాఫీ బిజినెస్ ఎంతలా విజయవంతమైందో అర్థం చేసుకోవచ్చు. వియన్నా,సీజెక్ రిపబ్లిక్,మలేషియా,నేపాల్,ఈజిప్ట్ వంటి దేశాల్లోనూ కేఫ్ కాఫీ డే సంస్థ ఔట్‌లెట్స్ ఉన్నాయి. ఇక డీకే శివకుమార్.. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేత.. ట్రబుల్ షూటర్ గా పేరుంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నారు.