భారత్ లో ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ వెళ్ళిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ ప్రభావం మిడిల్ క్లాస్ ప్రజలపై పడుతూ ఉంది. ఎప్పుడు ధరలు తగ్గుతాయా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ మధ్యే గ్యాస్ ధర కూడా రూ.10 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితి చాలా మెరుగుపడిందని, దీంతో రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత తగ్గుతాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇప్పుడిప్పుడే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గడం మొదలైంది. ఇవి మరింత తగ్గుతాయని అన్నారు. ముడి చమురు ధరలు తగ్గితే ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేస్తామనే మాట మీద నిలబడతామని అన్నారు. అయితే వీటి ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రజలు.