డెల్టా ప్లస్‌ డేంజరే.. పక్కనుండి పోయినా అంటుకుంటుంది..!

Delta Plus variant Important things you need to know.నిన్న, మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా సెకండ్ కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2021 2:15 AM GMT
డెల్టా ప్లస్‌ డేంజరే.. పక్కనుండి పోయినా అంటుకుంటుంది..!

నిన్న, మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా సెకండ్ కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన జ‌న‌జీవ‌నం ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతోంది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో చాలా రాష్ట్రాలు అన్‌లాక్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావ‌డంతో క‌రోనా నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డొచ్చున‌ని బావిస్తుండ‌గా.. డెల్టా ఫ్ల‌స్ ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్ రూపాంతరం చెంది డెల్టా ఫ్ల‌స్‌గా మారిన‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దేశంలో 40కిపైగా డెల్టా ఫ్ల‌స్ కేసులు న‌మోదు అయ్యాయి.

మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువ‌గా న‌మోదు కాగా.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు మొద‌ల‌య్యాయి. ఈ డెల్టా ఫ్ల‌స్ ను గుర్తించిన వారిలో తొలిసారిగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఓ మ‌హిళా చ‌నిపోయింది. స‌ద‌రు మ‌హిళ ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డంతో వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఇక ఈ కొత్త వేరియంట్ ప్ర‌మాద‌క‌రమ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాల‌తో కేంద్ర‌ప్ర‌భుత్వం దీన్ని వేరియంట్ ఆఫ్ క‌న్స‌ర్న్ గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ మ‌రింత శ‌క్తివంత‌మ‌ని, వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు హెచ్చరిస్తున్నారు. డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ సోకిన వారి ప‌క్క నుంచి మాస్కు పెట్టుకోకుండా వెళ్లినా కూడా వైర‌స్ సోకే అవ‌కాశం ఉంద‌ని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల తెలిపారు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్నా కొత్త వేరియంట్ సోకుంద‌ని హెచ్చ‌రించారు. మాస్కులు, శానిటైజేష‌న్‌, భౌతిక దూరం వంటి క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ డెల్టా ఫ్ల‌స్ వేరియంట్ మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయని తెలిపారు. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాలు అత్యంత కీలకమన్నారు. మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు డెల్టా రూపాంతరితం నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ డెల్టా ప్లస్‌ విషయంలో టీకాల సమర్థత ఎంత అన్నది ఇంకా తేలలేదు. టీకా ఒక డోసు తీసుకున్న తర్వాత కొందరు వైరస్‌ బారిన పడటాన్ని బట్టి చూస్తే కొత్త రూపాంతరితాలపై టీకా ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.

Next Story