నీళ్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో నీటి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  31 May 2024 1:16 PM IST
delhi, water crisis, petition,  supreme court,

నీళ్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం 

మొన్నటి వరకు బెంగళూరులో నీటి ఎద్దడి ఎలా ఉండేదో అందరం చూశాం. రానురాను నీటి యుద్ధాలు జరుగుతాయని పర్యావరణ నిపుణులు ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు జరిగేలానే కనిపిస్తోంది. బెంగళూరు వంతు అయిపోగానే.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో నీటి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం వాడుకునేందుకు నీళ్లు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైనన్ని నీళ్లను సరఫరా చేయలేక ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి కరువు వచ్చి జనాలు నానా అవస్తలు పడుతున్నారు. కాలనీల్లోకి ట్యాంకర్లు వస్తున్నా.. అవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఒక్క బకెట్ అయినా దొరకుతుందా అని ఆశతో చాలా మంది లైన్లలో ఎదురుచేస్తున్నారు. అంతేకాదు.. నీటిని జాగ్రత్త పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. నీటిని వృధా చేస్తే రూ.2వేల వరకు జరిమానా విధిస్తోంది. నిబంధనలను కచ్చితంగా అమలు చేయడానికి ఢిల్లీ సర్కార్ ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఏదీ ఏమైనా సరిపోయే అన్ని నీళ్లు లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నామనీ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ట్యాంకర్ల ధరలు కూడా అమాంతం పెంచేశారని వాపోతున్నారు. 4వేల నుంచి 5 వేల మందికి ఒక ట్యాంకర్‌ సరఫరా చేస్తున్నారనీ.. అవి ఎవరికి సరిపోతాయని నిలదీస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ ట్యాంకర్‌కు ఆర్డర్ ఇస్తే 20 రోజుల సమయం పడుతోందనీ.. ప్రయివేట్‌ ట్యాంకర్ కోసం వెళ్తే రూ.2వేల వరకు అడుగుతున్నారని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసింది. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి నీటిని సరఫరాచేయాలని సుప్రీంకోర్టును కోరింది ఢిల్లీ ప్రభుత్వం. నెల రోజుల పాటు నీటిని అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సర్కార్‌.. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని తెలిపింది. రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించింది. ముఖ్యంగా చాణక్యపురి సంజయ్‌ క్యాంప్ ప్రాంతం, గీతా కాలనీ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే ఒక నెల రోజుల పాటు అద‌నంగా నీటిని రిలీజ్ చేసేలా హ‌ర్యానా, యూపీ రాష్ట్రాలను ఆదేశించాల‌ని త‌మ పిటీష‌న్‌లో వేడుకుంది. ఇక ఢిల్లీ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!

Next Story