ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏకు 5 రోజుల పోలీస్‌ కస్టడీ

శనివారం సీఎం కేజ్రీవాల్ నివాసంలోనే బిభవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  19 May 2024 7:16 AM IST
delhi, swati maliwal, attack case, bibhav kumar, police custody,

 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏకు 5 రోజుల పోలీస్‌ కస్టడీ

ఢిల్లీలో ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి జరిగిన సంఘటన కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఏపీ బిభవ్‌ కుమార్‌ దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తాజాగా బిభవ్‌ కుమార్‌ను పోలీసులు కోర్టు లో హాజరుపర్చగా.. న్యాయస్థానం బిభవ్‌ను ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాగా.. శనివారం సీఎం కేజ్రీవాల్ నివాసంలోనే బిభవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన సమయంలో తనపై బిభవ్‌ కుమార్‌ దాడి చేశాడని స్వాతి మాలీవాల్ ఫిర్యాదులో పేర్కొంది. ఛాతి, కడుపు, పొత్తి కడుపై తన్ని తీవ్రంగా కొట్టాడని వాపోయింది. నేలపై ఈడ్చి.. షర్టు పైకి లాగాడని వెల్లడించింది. ఇదే కేసులో బిభవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపింఏదుకు ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని జస్టిస్‌ను కోరారు. అయితే.. ఎంపీపై దాడి జరిగిందనీ.. సీఎం నివాసం నుంచి కొంత సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చిందనీ కూడా పోలీసులు చెప్పారు. మరోవైపు బిభవ్‌ తన ఫోన్ పాస్‌వర్డ్‌ను ఇవ్వడం లేదని కోర్టులో చెప్పారు. ఆధారాలు ధ్వసం చేసేందుకు ఫోన్‌ను ఫార్మాట్‌ చేశాడని ఆరోపించారు. ఈ మేరకు నిపుణుల సాయంతో బిభవ్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి.. విచారణ జరపాల్సి ఉందనీ పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ క్రమంలోనే ఏడు రోజుల కస్టడీకి కోరారు.

బిభవ్‌ తరఫున వాదనలు వినిపించిన లాయర్.. సోమవారం దాడి జరిగితే ఆలస్యంగా ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నించారు. మరోవైపు స్వాతిమాలివాల్ సీఎం కార్యాలయానికి వెళ్లకుండా.. ఆయన నివాసానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నలను లేవనెత్తారు. విజిటింగ్‌ అవర్స్‌ ముగిసిన తర్వాత ఆమె సీఎం నివాసానికి వచ్చినట్లు గుర్తించామన్నారు బిభవ్ తరఫు లాయర్. ఈ క్రమంలోనే విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి బిభవ్‌ను అనుమతి ఇస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు బిభవ్ అరెస్ట్‌ నేపథ్యంలో అతను యాంసిపేటరీ బెయిల్‌ దాఖలు చేశాడు. దాన్ని కూడా ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.

Next Story