ఢిల్లీలో రెండ్రోజులుగా భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా రెండోరోజు వర్షాలు కురుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  9 July 2023 5:04 AM GMT
Delhi, Rain, IMD, Weather, Yellow Alert,

ఢిల్లీలో రెండ్రోజులుగా భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా రెండోరోజు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 24 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికీ జలమయం అయ్యాయి. రానున్న 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు తీవ్రస్థాయిలో కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో.. దేశ రాజధాని ఢిల్లీకి వర్షాల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు కూడా వర్షపు నీటితో మునగడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని అండర్‌ పాస్‌లు వరద నీటితో నిండిపోయాయి. దాంతో అధికారులు వాటిని మూసివేశారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండటం వల్ల చాలా వరకు పనులను వాయిదా వేసుకుంటున్నారు. కొన్ని చోట్ల వరద నీరు సాఫీగా వెళ్లిపోయేందుకు డ్రైనేజీలను తెరిచిపెడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇళ్లలోకి నీరు చేరుకుంటే సమాచారం అందించాలని సూచించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎడతెరిపిలేని వర్షాలతో ఢిల్లీలో ఇప్పటికే 15 ఇళ్లు కూలిపోయాయి. ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ సందర్భంగా పాత భవనాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక రానున్న నాలుగు,ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంగా కొనసాగుతోందని చెప్పారు. పంజాబ్‌, హర్యానాల్లో ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయని తెలిపారు.

Next Story