విన్యాసాలు వద్దు.. వైరల్ వీడియో ట్వీట్‌ చేసిన పోలీసులు

ఢిల్లీ పోలీసులు రోడ్‌సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2023 3:41 PM IST
Speed Kills, Bike Ride, Viral Video, Delhi police

విన్యాసాలు వద్దు.. వైరల్ వీడియో ట్వీట్‌ చేసిన పోలీసులు

రోడ్డుమీదకు వస్తే చాలు కొందరు ఆకతాయిలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తారు. స్పోర్ట్స్‌ బైక్‌లతో నానా హంగామా చేస్తారు. ఇతర వాహనాదారులను భయాందోళనకు గురి చేస్తారు. చిత్రవిచిత్ర స్టంట్స్‌ చేస్తుంటారు. చేయడానికి థ్రిల్‌గా ఫీలయినా కొన్నిసార్లు అవి బెడిసికొడతాయి. ప్రమాదంలో పడి ఎముకలు నుజ్జునుజ్జు అవుతాయి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని.. క్షేమంగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరు వినరు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు రోడ్‌సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు కానీ.. ఓ జంట స్పోర్ట్‌ బైక్‌ను తీసుకుని రోడ్డుపైకి వచ్చింది. ఎగ్జైట్‌మెంట్ ఫీలయినట్లు ఉన్నారు. రోడ్డుపై అతివేగంగా వెళ్తూ స్టంట్స్‌ చేశారు. వెనకాలే యువతి కూర్చొని ఉంది. బైక్‌ నడుపుతున్న యువకుడు ముందు టైర్‌ని గాల్లోకి లేపుతూ ముందుకు పోనిచ్చాడు. రయ్‌రయ్‌ మంటూ అతివేగంగా దూసుకెళ్లాడు. కానీ.. ఉన్నట్లుండి బైక్‌ అదుపుతప్పింది. దీంతో.. యువతి కిందపడిపోయింది. ఆ తర్వాత యువకుడు కూడా బొక్కాబోర్ల పడ్డాడు. బైక్‌ అతివేగంగా ఉండటంతో వీరిద్దరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెనకాలే వస్తున్న కొందరు దీన్ని వీడియో తీశారు. ఇదే వీడియోను ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసి.. రోడ్‌సేఫ్టీపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాల్లో పడొద్దని.. స్పీడ్‌ థ్రిల్‌ను ఇవ్వొచ్చు కానీ.. చంపుతుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story