ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసం దగ్గర డ్రోన్ కలకలం
ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 3 July 2023 10:14 AM ISTఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసం దగ్గర డ్రోన్ కలకలం
ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రధాని నివాసం దగ్గర నో ఫ్లయింగ్ జోన్‌లో ఉన్నట్లుండి ఓ డ్రోన్ కనిపించింది. కాసేపు అక్కడే చక్కర్లు కొట్టింది. అయితే.. కాసేపటికే భద్రతా సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్‌ను పట్టుకునేప్రయత్నం చేశారు. కానీ అది వారికి దొరకలేదు. పట్టుకునేలోపు దుండుగులు డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వెంటనే ఎస్పీజీ అధికారులు ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందించారు.
ప్రధాని అధికారిక నివాసంలో నో ఫ్లయింగ్ జోన్‌లో డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు అధికారులు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ ప్రారంభించారు. కాగా.. డ్రోన్ నివాసంపై చక్కర్లు కొడుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లోనే ఉన్నారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యంత హై సెక్యూరిటీ ఉండే ప్రధాని నివాసం వద్దే డ్రోన్ ఎగరేశారు దుండగులు. దీంతో.. భద్రతా వైఫల్యంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది మరింత అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీ మరింత పెంచి అలర్ట్‌గా ఉంటున్నారు.