ఇవాళే కేంద్ర బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్

పార్లమెంట్‌లో ఇవాళే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది.

By Srikanth Gundamalla
Published on : 23 July 2024 2:00 AM

delhi, parliament, budget session, minister Nirmala Sitharaman,

ఇవాళే కేంద్ర బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్

పార్లమెంట్‌లో ఇవాళే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ లోక్‌సభలో బడ్జెట్‌ స్పీచ్‌ను ప్రారంభించబోతున్నారు. రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్‌, హౌసింగ్​, రక్షణ, రైల్వే తదితర రంగాలకు ఈ బడ్జెట్​లో ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సారి కేంద్ర బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఏడోసారి ప్రవేశపెడుతోన్న బడ్జెట్‌ కావడం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు కూడా పన్ను ఉపశమనాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని.. ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరోవైపు 2047 నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉండబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ రంగాలకు ప్రాధానత్య ఉంటుందని వెల్లడించారు.

బడ్జెట్‌పై ఉభ సభల్లో సుదీర్ఘ చర్చ జరుగనుంది. లోక్‌సభ రాజ్యసభల్లో 20 గంటల పాటు చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. రైల్వేలు, విద్య, ఆరోగ్యం, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు తదితర అంశాలను ప్రత్యేకంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ పార్టీల ఎంపీలతో కూడిన సభా వ్యవహారాల కమిటీ సోమవారం భేటీ అయ్యి ఈ మేరకు ఎజెండాను ఖరారు చేసింది. మరోవైపు 2014 నుంచి రెండు దఫాలు బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజార్టీతో ఉంది. కానీ.. ఈ సారి మాత్రం కూటమి భాగస్వామ్యంతోనే అధికారంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీకి కేంద్రం నిధుల్లో భారీ కేటాయింపులు ఉంటాయని ఆయా ప్రభుత్వాలు బావిస్తున్నాయి.

Next Story