ఢిల్లీ మెట్రోలో తన్నుకున్న ప్రయాణికులు..వీడియో వైరల్

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడి.. తన్నుకున్నారు. వీడియో వైరల్‌ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2023 5:11 PM IST
Delhi Metro, Viral Video, Two Persons, Fight

ఢిల్లీ మెట్రలో తన్నుకున్న ప్రయాణికులు..వీడియో వైరల్

ఢిల్లీ మెట్రో అంటేనే వైరల్‌కు కేరాఫ్‌గా మారింది. ఈ మధ్య కాలంలో యువత ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయి ప్రవర్తించారు. చుట్టూ ఎవరున్నారనే విషయం పట్టించుకోకుండా.. బరితెగించి రొమాన్స్‌ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువతులు ఏదో తిట్టుకుని పోట్లాడారు కూడా. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఏదో విషయంలో గొడవపడి కొట్టుకున్నారు. బోగీ అంతా ప్రయాణికులతో ఉన్నా.. ఎవరూ వారిని ఆపలేదు. ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ ఘటన రాజానహర్‌సింగ్, కశ్మీర్‌ గేట్‌ స్టేషన్ల మధ్య వైలెట్‌ రూట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఏదో విషయంలో ఇద్దరు వ్యక్తులు ముందు మాటామాటా అనుకున్నారు. అది కాస్త పెరిగి తన్నుకునే వరకు వచ్చింది. బలంగా ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నారు.. వారికి ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించకుండా విచక్షణ కోల్పోయి కొట్టుకున్నారు. అక్కడే ఉన్నవారు కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. కొందరైతే వారికి దూరంగా జరిగి కూర్చొన్నారు. దిగాల్సిన స్టేషన్‌ వస్తే రైలు దిగిపోతున్నారు. చివరకు ఇద్దరూ వారువారు దిగాల్సిన స్టేషన్లలో దిగిపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ గొడవను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. అది కాస్త వైరల్‌ అయ్యింది. చివరకు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారుల వరకు స్పందించింది. దీనిపై స్పందించిన డీఎంఆర్‌సీ మెట్రోలో ప్రయాణికులు బాధ్యతగా మెలగాలని.. ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని కోరింది. ఇలా మరెవరైనా ప్రవర్తిస్తే వెంటనే డీఎంఆర్‌సీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలని సూచించింది.

దీనిపై నెటిజన్లు రకకాలుగా స్పందిస్తున్నారు. ఎంటర్‌టైన్మెంట్‌కు ఢిల్లీ మెట్రో అడ్డా అవుతోందని అంటున్నారు. జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి.. ఎవరైనా సరే ప్రశాంతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇంకొందరు కామెంట్స్‌ పెడుతున్నారు.

Next Story