ఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్
లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 10 April 2024 11:13 AM ISTఈడీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్
లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఈడీ తనని అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సర్వోత్తర న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే.. ఇప్పటికే తనని ఈడీ అరెస్ట్ చేయడంపై కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయనీ.. అందుకే కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. సీఎం అరెస్ట్, రిమాండ్ చట్ట విరుద్ధం కాదంటూ వ్యాఖ్యానించింది. దాంతో.. కేజ్రీవాల్ ఈసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ను కేజ్రీవాల్ దాఖలు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే.. కేజ్రీవాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.