ఆ బాష‌లో మాట్లాడొద్దంటూ కేర‌ళ న‌ర్సుల‌కు ఢిల్లీ ఆసుపత్రి వార్నింగ్‌

Delhi Hospital Warning to Nurses.క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో న‌ర్సులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అయితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 9:20 AM GMT
ఆ బాష‌లో మాట్లాడొద్దంటూ కేర‌ళ న‌ర్సుల‌కు ఢిల్లీ ఆసుపత్రి వార్నింగ్‌

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో న‌ర్సులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అయితే.. ఢిల్లీకి చెందిన ఓ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం కేర‌ళ న‌ర్సుల‌కు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్ప‌దంగా మారాయి. ఆస్ప‌త్రిలో ప‌నిచేసే న‌ర్సులు కేవ‌లం ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లోనే మాట్లాడాల‌ని ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఈ అంశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై మలయాళీలతో పాటు నెటీజ‌న్లు మండిపడుతున్నారు.

ఢిల్లీలోని గోవింద్ బల్లబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (GIPMER)లో కేరళకు చెందిన నర్సులు పనిచేస్తున్నారు. అయితే జిప్‌మ‌ర్‌ఇన్ స్టిట్యూట్.. నర్సులకు ఓ ఆదేశాన్ని జారీ చేసింది. ఆస్పత్రిలో ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చ‌రించింది. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు, సహచర ఉద్యోగుల్లో ఎక్కువ మందికి మలయాళం అర్థంకాకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోందని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. దీనికి సంబందించి తమకు ఓ ఫిర్యాదు అందినట్లు జిప్‌మెర్ తెలిపింది.

కాగా.. ఆస్ప‌త్రి ఇచ్చిన ఆదేశాల‌పై మ‌ల‌యాళీలు మండిప‌డుతున్నారు. మాతృ భాషలో మాట్లాడుకోవద్దంటూ ఆదేశాలివ్వడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నిస్తున్నారు. నర్సులకు ఇలాంటి ఆదేశాలివ్వడం సరికాదని జీబీ పంత్ నర్సస్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాధర్ రామచందాని పేర్కొన్నారు. సర్క్యులర్‌లో వాడిన పదజాలం అభ్యంతకరంగా ఉందన్నారు.

Next Story