ఢిల్లీలో కుండపోత, గంటలోనే 11.25 సెం.మీ వర్షపాతం.. స్కూళ్లకు సెలవు
దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం పడుతోంది. బుధవారం సాయంత్రం ఏకధాటిగా భారీ వర్షం పడింది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 2:21 AM GMTఢిల్లీలో కుండపోత, గంటలోనే 11.25 సెం.మీ వర్షపాతం.. స్కూళ్లకు సెలవు
దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం పడుతోంది. బుధవారం సాయంత్రం ఏకధాటిగా భారీ వర్షం పడింది. దాంతో. పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 11.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్ల మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలబడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా రోడ్లపై వాహనాలు నిలిచపోయాయి. దాంతో.. వాటిని క్లియర్ చేసేందుకు అధికారులు శ్రమించాల్సి వచ్చింది. ఇక గురువారం కూగా ఢిల్లీలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతికూల వాతావరణంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన టోక్యో విమానం సహా పది విమానాలను దారి మళ్లించారు. గురువారం ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అనసవరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. అయితే..వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో.. అధికారులు సహాయక సిబ్బందిని సిద్దంగా ఉంచుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు రావూస్ అకాడమీలో ముగ్గురు విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్ రాజేందర్‌నగర్‌లో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సివిల్స్ అభ్యర్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. రాజేంద్రనగర్ ప్రాంతం మరోసారి వరదనీటిలో మునిగిపోయింది. అక్కడ అనేక కోచింగ్ సెంటర్లలోకి వర్షం నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.