దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తన రుద్ర రూపం చూపిస్తోంది. రోజుకు సుమారు 20 వేల కేసులతో విలవిల్లాడుతున్న ఢిల్లీలో లాక్ డౌన్ మరో వారం రోజులు పాటూ పొడిగించారు. ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ లో వెల్లడించారు. కరోనా రోగులు ఈ విధంగా మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఢిల్లీకి ప్రస్తుత పరిస్థితుల్లో 976 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 312 టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఇంత తక్కువ స్థాయిలో ప్రాణవాయువు అందిస్తుంటే ఢిల్లీ ఎలా ఊపిరి పీల్చుకుంటుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో గత 24 గంటల్లో 27 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 375 మంది కరోనాకు బలయ్యారు. ఢిల్లీలో వరుసగా 13వ రోజు కూడా 20వేలకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.సరిగ్గా రెండు నెలల క్రితం వరకు ఢిల్లీలో రోజుకు 200 కేసులు మాత్రమే వచ్చేవి. ప్రస్తుతం లక్ష వరకు యాక్టివ్ కేసులు ఉండడంతో దేశ రాజధానిలో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది సోమవారం ఉదయం 5 గంటలకు ముగియాల్సి ఉంది. ఐతే కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగించారు. ఆక్సిజన్ దొరక్క, బెడ్లు లేక పెషేంట్ ల బాధలు వర్ణనాతీతం. శనివారం బత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక 12 మంది రోగులు మరణించారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story