Delhi: 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 భృతి
ఢిల్లీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 4 March 2024 5:00 PM ISTDelhi: 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 భృతి
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ.1000 భృతి అందించనున్నట్లు తెలిపింది. ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి రూ.76,000 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పదో బడ్జెట్ ఇది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రూ.1000 భృతి ఇవ్వడంతో ఆ రాష్ట్రంలోని మహిళలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి రాష్ట్ర ప్రభుత్వ విజయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఉన్న ఇబ్బందులను.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించిన తీరుని వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకాల గురించి కూడా ఆర్థిక అతిషి వివరించారు. ప్రతి ఒక్కరికీ విద్య ఎంతో అవసరమని చెప్పిన ఆమె.. విద్యపై వెచ్చించేందుకు ఆదాయం లేకపోవడంతో డిల్లీ వాసులు తమ కుమారులను ప్రయివేట్ స్కూళ్లకు, కూతుర్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే బాలికలు ఐఐటీ, నీట్ పరీక్షలను క్లియర్ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్య నాణ్యతా ఎంత అబ్భతంగా ఉందో దీన్ని బట్టే అర్థం అవుతోందని చెప్పారు. విద్య జీవితాలనే మార్చేస్తుందని చెప్పారు. సంపన్నుల పిల్లలు సంపన్నులుగా, పేదల పిల్లలు పేదవారిగానే ఉండిపోతారనే నానుడి మారిన పరిస్థితి ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిందని ఆర్థిక మంత్రి అతిషి చెప్పారు.
విద్యశాఖ కోసం ఢిల్లీ ప్రభుత్వం అనేక ఖర్చులను పెట్టిందని ఆమె చెప్పారు. 2015 నుంచి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు 22,711 నూతన తరగతి గదులను నిర్మించినట్లు మంత్రి అతిషి చెప్పారు. విద్యకు ఢిల్లీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అలాగే ఈ ఏడాది విద్య కోసం రూ.16,396 కోట్లు కేటాయించిందని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి చెప్పారు.