'12th ఫెయిల్‌' సినిమా ఫేమ్ ఇన్స్టిట్యూట్ కూడా నిబంధనలను పాటించలేదట!!

ఢిల్లీ లోని ముఖర్జీ నగర్‌లోని సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్న ప్రముఖ కోచింగ్ సెంటర్‌లలో ఒకటైన 'దృష్టి IAS' నిబంధనలను ఉల్లంఘించిందని తేలింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2024 2:45 PM IST
Delhi Flood Deaths, 12th Fail Movie, Drishti IAS, Vikas Divyakirti, Delhi coaching centres

12th Fail సినిమా ఫేమ్ ఇన్స్టిట్యూట్ కూడా నిబంధనలను పాటించలేదట!! 

ఢిల్లీ లోని ముఖర్జీ నగర్‌లోని సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్న ప్రముఖ కోచింగ్ సెంటర్‌లలో ఒకటైన 'దృష్టి IAS' నిబంధనలను ఉల్లంఘించిందని తేలింది. నేలమాళిగల్లో క్లాసులు, లైబ్రరీలు నిర్వహిస్తున్నందుకు పలు కోచింగ్ సెంటర్లను సీలు చేశారు. 20కు పైగా కోచింగ్ సెంటర్‌లు ఉండగా.. దృష్టి IAS కోచింగ్ సెంటర్ కూడా ఒకటి. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన '12త్ ఫెయిల్' సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో స్వయంగా నటించిన వికాస్ దివ్యకీర్తి ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్నారు.

భారీ వర్షం కారణంగా రాజిందర్ నగర్‌లోని రావూస్ IAS స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీ మునిగిపోవడంతో సివిల్ సర్వీసెస్ లో కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మరణించడంతో అధికారులు పలు సివిల్స్ కోచింగ్ సెంటర్లపై దృష్టి పెట్టారు. రావూస్ కోచింగ్ సెంటర్ కింద.. సింగిల్ బయోమెట్రిక్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తూ ఉన్నారు. ఈ విషాద ఘటనలో చనిపోయిన వారిని తెలంగాణకు చెందిన తాన్యా సోని, యూపీకి చెందిన శ్రేయా యాదవ్, కేరళకు చెందిన నవీన్ డెల్విన్ గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా నేలమాళిగలోకి నీరు రావడంతో నాలుగు గంటలకు పైగా వీరు నీళ్లలోనే చిక్కుకున్నారు. ఆ ప్రాంతంలో డ్రెయిన్‌ పగిలిపోవడంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది.

మాజీ సివిల్ సర్వెంట్ అయిన వికాస్ దివ్యకీర్తికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. దృష్టి IAS అనే సంస్థను 1999 నుండి నడుపుతూ ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో కోచింగ్ ఇస్తోంది. వికాస్ ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1996లో ఆయన తన మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఒక సంవత్సరం పనిచేశారు. ఆయన ఆ తర్వాత.. తన పదవికి రాజీనామా చేసి, తిరిగి అధ్యాపక వృత్తిలో చేరి, దృష్టి IASని స్థాపించారు.

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఇతర ప్రముఖ కోచింగ్ సెంటర్లయిన వాజి రామ్, రవి IAS హబ్, రాజిందర్ నగర్‌లోని శ్రీరామ్ IAS ఇన్స్టిట్యూట్, IAS గురుకుల్, చాహల్ అకాడమీ, ప్లూటస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, IAS సేతు, టాపర్స్ అకాడమీ, దైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ IAS, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యా గురు, గైడెన్స్ IAS.. లకు కూడా నోటీసులు జారీ చేసింది. రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ లలో బిల్డింగ్ లో సరైన ప్రమాణాలు పాటించకుండా చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్న కోచింగ్ సెంటర్‌ల 20 బేస్‌మెంట్లను సీలు చేసింది. వరదనీరు వెళ్లకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి అధికారులు పూనుకున్నారు.

ఈ సంఘటన తర్వాత, పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో మునిగిపోయిన ముగ్గురు విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఓల్డ్ రాజిందర్ నగర్‌లో విద్యార్థులు నిరసన చేపట్టారు. రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సీఈవో, యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌తో పాటు బేస్‌మెంట్ యజమానిని అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ‘‘ఈ ఘటనను పట్టించుకోకపోతే మరింత మంది విద్యార్థులు చనిపోతారు.. మా తోటి విద్యార్థులకు న్యాయం జరగదు.. ఇప్పుడు మన హక్కు కోసం పోరాడకపోతే భవిష్యత్తులో దేశానికి ఎలా సేవ చేస్తాం.. ఇది పూర్తి నిర్లక్ష్యం." అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థి రాహుల్ శర్మ అన్నారు. నిరసన తెలిపిన మరో విద్యార్థి మాట్లాడుతూ.. "ఎంసిడి అతిపెద్ద దోషి, వర్షం వచ్చినప్పుడల్లా, వీధులు నీటితో నిండిపోతాయి. మీరు తెరిచిన మ్యాన్‌హోల్‌లో పడి లేదా విద్యుత్ షాక్‌కు గురై చనిపోయే ప్రమాదం ఉంది. ఏదైనా జరగవచ్చు." అని విమర్శించాడు.

ఈ విషాద ఘటనపై దృష్టి IAS యజమాని వికాస్ దివ్యకీర్తి తన మౌనం వీడారు. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు బాధితుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. దివ్యకీర్తి మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న కోపానికి అర్థం ఉంది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలో సమగ్రమైన మార్గదర్శకాలను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కోపాన్ని సరైన మార్గంలో మళ్లించి, ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలను రూపొందిస్తే బాగుంటుంది, ఈ విషయంలో ప్రభుత్వానికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించిన ఈ సమస్య పైకి కనిపించేంత సున్నితమైనది కాదు.. ఇది చట్టాల అస్పష్టత, వైరుధ్యంతో ముడిపడి ఉన్న అనేక అంశాలను కలిగి ఉందని దివ్యకీర్తి తెలిపారు. DDA, MCD, ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో సహా వివిధ సంస్థల నుండి వచ్చిన నిబంధనలలో అనేక అసమానతలు ఉన్నయని ఆయన హైలైట్ చేశారు.

Next Story