ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వెనుకంజలో 'ఆప్' అగ్ర నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
By Medi Samrat Published on 8 Feb 2025 8:48 AM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫిబ్రవరి 5న ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. ఈసారి 60.54 శాతం ఓటింగ్ జరగగా, చివరిసారి ఢిల్లీలో 62.60 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్‌లో బీజేపీ 10 స్థానాల్లో, ఆప్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ పోకడలలో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద నాయకులు అంతా వెనుకబడి ఉన్నారు. కేజ్రీవాల్, సీఎం అతిషి, మనీష్ సిసోడియాలు వెనుకబడ్డారు.
జనక్‌పురి, చాందినీ చౌక్‌లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఢిల్లీలోని గోకల్‌పురి అసెంబ్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. పట్పర్‌గంజ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశం ఉందంటున్నారు.
ముఖ్యమంత్రి అతిశి మాట్లాడుతూ.. ఇవి సాధారణ ఎన్నికలు కాదని, ఈ ఎన్నికలు మంచికి చెడుకి మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికలు పనికి, గూండాయిజానికి మధ్య జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రజలు మంచితనం వైపే నిలబడతారనే పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటా. మేము కల్కాజీలో, మొత్తం ఢిల్లీలో గెలుస్తామన్నారు.
ఢిల్లీలోని అత్యంత వీఐపీ న్యూ ఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మాట్లాడుతూ ఈ రోజు ఢిల్లీకి ముఖ్యమైన రోజు అని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. ప్రవేశ్ వర్మ ఫలితాలకు ముందు కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగగా, కాంగ్రెస్ తరఫున సందప్ దీక్షిత్ బరిలోకి దిగారు.
జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. “ఫలితం రోజున అందరూ ఆందోళన చెందుతున్నారు. మేం కూడా మనుషులమే.. కానీ, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో పని చేశాం కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనే నమ్మకం ఉంది. నిజాయితీ, పని రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.. ప్రజలు తమ తీర్పును వెలువరించారు, మరికొద్ది గంటల్లో ప్రకటిస్తారన్నారు.