ఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌.. మార్కెట్లు మూసివేస్తాం.. అనుమతివ్వండి

Delhi CM Kejriwal Seeks To Shut Delhi Markets.. దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

By సుభాష్  Published on  17 Nov 2020 10:04 AM GMT
ఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌.. మార్కెట్లు మూసివేస్తాం.. అనుమతివ్వండి

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనాను అదుపులోకి తీసుకురావాలంటే మార్కెట్లను మూసివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మార్కెట్లు కరోనా హాట్ స్పాట్‌లుగా మారిపోయాయని, కరోనా కేసులను తగ్గించేందుకు కొన్ని రోజుల పాటు మార్కెట్లను మూసివేసేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం లేదని, ఇప్పటికే ఢిల్లీలో మూడో దశ దాటేసిందని నిన్న ఆ రాష్ట్ర మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు.


కాగా, తాజాగా మంగళవారం సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి ఓ వినతి పంపించామని, ఒక వేళ అవసరమైతే కొన్ని రోజుల పాటు ఢిల్లీలో మార్కెట్లను మూసివేస్తామని అన్నారు. కోవిడ్‌ ఆంక్షలను పాటించని మార్కెట్లు లోకల్‌ కోవిడ్‌ -19 హాట్ స్పాట్లుగా మారుతున్నాయని అన్నారు. అంతేకాకుండా వివాహ కార్యక్రమాలకు అనుమతించే వారి సంఖ్యను కూడా తగ్గించాలని చూస్తున్నట్లు చెప్పారు.

ఇక ఢిల్లీ ఆస్పత్రుల్లో 750 ఐసీయూ బెడ్స్‌ పెంచినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వ ఏజన్సీలన్ని రెండింతలుగా పని చేస్తున్నాయని అన్నారు. ఇక ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 4.89 లక్షలు దాటేసింది. ఇప్పటి వరకు 7,600 మంది మరణించారు.

Next Story