దేశాన్ని విభజించే శక్తులపై పోరాడుతూనే ఉంటా: సీఎం కేజ్రీవాల్
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు.
By Srikanth Gundamalla Published on 13 Sept 2024 8:15 PM ISTఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయనకు శుక్రవారమే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వచ్చారు.జైలు నుంచి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన సీఎం కేజ్రీవాల్‌కు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అభిమానులు జైజేలు కొట్టారు. ఒక వైపు వర్షం పడుతున్నా.. జైలు వద్దే ఉండి కేజ్రీవాల్‌కు వెల్‌కమ్ చెప్పారు. తనకు స్వాగతం పలికేందుక వచ్చిన అందరికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
జైలు నుంచి విడుదలైన సందర్బంగా మాట్లాడిన కేజ్రీవాల్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వర్షం పడుతున్నా తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి సీఎం కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన జీవితాన్నే దేశానికి అంకితం చేశానని చెప్పారు. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ.. కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అయినా తాను సత్యమార్గాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదని చెప్పారు. దేవుడి ఆశీస్సుల వల్లే తాను ఇక్కడి వరకు వచ్చానని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తనని జైల్లో పెట్టి తన మనోధైర్యాన్ని దెబ్బతీశామని అనుకుంటే పొరపాటే అన్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చాక మనోధైర్యం వంద రెట్లు మరింత పెరిగిందని అన్నారు. భగవంతుడు చూపిన మార్గంలోనే నడుస్తూ.. దేశానికి సేవ చేస్తూనే ఉంటానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇక దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై పోరాటం కొనసాగిస్తానన్నారు.