ఆరోసారి కూడా ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 11:11 AM ISTఆరోసారి కూడా ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. అయితే.. తాజాగా ఆరోసారి కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యారు. ఈడీ సమన్ల ప్రకారం సోమవారం ఆయన ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సి ఉంది. కానీ.. ఆయన విచారణకు రావడం లేదని సీఎం కేజ్రీవాల్.. ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉందనీ.. ఈ నేపత్యంలో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించింది.
ఈ మేరకు ఈడీ అధికారులకు సమాచారం పంపిన అమ్ ఆద్మీ పార్టీ.. ఈ సమన్లపై కోర్టులో కేసు నడుస్తోందని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు సంస్థే కోర్టును ఆశ్రయించిందని అన్నారు. విచారణ పెండింగ్‌లో ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట వ్యతిరేకమని అన్నారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందే అని అమ్ ఆద్మీ పార్టీ ప్రకటనలో తెలిపింది.
లిక్కర్ స్కీం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం కేజ్రీవాల్ స్పందించడం లేదని.. ఈడీ ఇటీవల కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో గత శనివారం కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు అయ్యారు. ఆ రోజు విశ్వాస పరీక్ష ఉందనీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణకు హాజరు అవుతానని సీఎం కేజ్రీవాల్ కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 13వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.