కేజ్రీవాల్‌ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు: తీహార్ జైలు అధికారులు

కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆప్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో తీహార్ జైలు అధికారులు స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  3 April 2024 5:06 PM IST
delhi, cm kejriwal, health update, jail officials, ed case,

కేజ్రీవాల్‌ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదు: తీహార్ జైలు అధికారులు

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసి విచారించారు. తర్వాత ఆమెను జ్యుడీషియల్‌ రిమాండ్ కింద తీహార్ జైలుకు తరలించారు. ఇక కవిత అరెస్ట్‌ అయిన కొద్ది రోజులకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన్ని కూడా ఈడీ విచారించింది. ఆ తర్వాత ఇటీవలే ఆయన్ని కూడా జ్యుడిషియల్ కస్టడీ కింద తీహార్ జైలుకు తీసుకెళ్లారు.

తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోగ్యం బాగోలేందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బ్లడ్‌, షుగర్‌ లెవెన్స్‌ దారుణంగా పడిపోయాయని చెబుతున్నారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణించడంతో 4.5 కిలోల బరువు తగ్గారంటూ ఆప్ నేతలు చెప్పారు. కేజ్రీవాల్‌ మధుమేహంతో బాధపడుతున్ఆనరనీ.. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా 24 గంటలు దేశ సేవ, ప్రజా సేవకే అంకితం అయ్యారని ఆప్ మంత్రి ఆతిషి చెప్పారు. ఆయన అరెస్ట్‌ తర్వాత క్రమంగా కేజ్రీవాల్‌ బరువు తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచడం ద్వారా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని ఆతిషీ ఆరోపించారు.

ఇక కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆప్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో తీహార్ జైలు అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కేజ్రీవాల్ ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమి లేదని తేల్చారు. ఆయన కీలక ఆరోగ్య వ్యవస్థలన్నీ భేషుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే.. కేజ్రీవాల్ ను ఇద్దరు వైద్యులు పరిశీలించారని ఆ తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. బీపీ, షుగర్‌ లెవెల్స్‌తో పాటు.. ఇతర అవయవాల పని తీరు అంతా బాగుందని వైద్యులు చెప్పినట్లు జైలు అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. జైలుకు వచ్చే నాటికి కేజ్రీవాల్‌ 65 కిలోలు ఉన్నారనీ.. ఇక ఇప్పుడు కూడా అంతే బరువు ఉన్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్‌కు తన ఇంటి నుంచి వస్తున్న భోజనాన్నే అందిస్తున్నట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు.

అయితే.. తీహార్ జైలు అధికారుల ప్రకటనను ఆప్‌ నేతలు ఖండిస్తున్నారు. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు 69.5 కిలోల బరువు ఉన్నారనీ.. కానీ ఇప్పుడు 65 కిలోలకు తగ్గారని అంటున్నారు. మొత్తంగా చూస్తే కేజ్రీవాల్‌ ఇంత వేగంగా బరువు తగ్గడం అనారోగ్యానికి గురవ్వడం ఆందోళనగా ఉందని ఆప్‌ నేతలు అంటున్నారు.

Next Story