ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ పొడిగింపు..కోర్టులో వాదోపవాదనలు

లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్ట్‌ అయిన సీఎం కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది.

By Srikanth Gundamalla  Published on  28 March 2024 12:53 PM GMT
delhi, cm kejriwal, ed remand, extended ,

 ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ పొడిగింపు..కోర్టులో వాదోపవాదనలు 

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈడీ కస్టడీ నుంచే సీఎం కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తున్నారు. దీనిపై ఈడీ అధికారులు సీరియస్ అవుతుంటే.. మద్దతు దారులు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది.

లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్ట్‌ అయిన సీఎం కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో ఆయన్ని ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది, సీఎం కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈడీ విజ్ఞప్తి మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కస్టడీని పొడిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

తనని అరెస్ట్‌ చేసినా.. ఇప్పటి వరకు ఏ కోర్టు దోషిగా తేల్చలేదని అన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తనని ఎందుకు అరెస్ట్‌ చేశారని అడగాలని అనుకుంటున్నట్లు కోర్టుతో చెప్పారు. కేవలం నలుగురి ప్రకటనల్లోనే తన పేరు కనిపించిందని చెప్పారు. ఈడీ రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు తనపై వేస్తుందని చెప్పారు. ఈడీ విచారణ తర్వాతే అసలైన మద్యం కుంభకోణం ప్రారంభమైందని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని నాశనం చేయడం కోసమే ఈడీ ఈ విధంగా చేస్తోందనీ.. బెదిరింపులకు పాల్పుడుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇక ఈడీ మాత్రం గోవా ఎన్నికలకు రూ.100 కోట్ల సొమ్మును ఆప్‌కు అందాయని ఆరోపించింది. మొబైల్ డేటా రికవరీ చేసినట్లు కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు.

Next Story