మళ్లీ జైలుకెళ్తున్నా..ఈసారి ఎంతకాలం ఉంచుతారో తెలియదు: కేజ్రీవాల్

జూన్ రెండో తేదీన కేజ్రీవాల్‌ సరెండర్‌ అవుతున్నట్లు పేర్కొన్నారు.

By Srikanth Gundamalla  Published on  31 May 2024 1:45 PM IST
delhi, cm kejriwal,   jail ,

మళ్లీ జైలుకెళ్తున్నా..ఈసారి ఎంతకాలం ఉంచుతారో తెలియదు: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణల కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొంతకాలం తీహార్‌ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 21 రోజుల పాటు ప్రచారం నిర్వహించుకునేందుకు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇచ్చింది. ఇక ఈ మధ్యంతర బెయిల్ గడువు జూన్ 2వ తేదీతో ముగియనుంది. దాంతో.. ఆయన మరోసారి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ను మరో వారం పాటు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కానీ.. దాన్ని అత్యుతన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

జూన్‌ 2న జైలుకు వెళ్లాల్సిన సందర్భంగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఒక వీడియోను విడుదల చేశారు. ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూన్ రెండో తేదీన ఆయన సరెండర్‌ అవుతున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ తీహార్ జైలుకు తనని తరలిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గతంలో ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు 21 రోజుల సమయం ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. అయితే.. ఈ సారి తనని జైలులో ఎంతకాలం ఉంచుతారనేది తెలియదని పేర్కొన్నారు. తాను నియంతృత్వంపై పోరాటం చేస్తున్నాననీ.. ఈ పోరాటంలో ఏ మాత్రం వెనకడుగు వేయబోను అని స్పష్టం చేశారు. ఈ పోరాటం చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.

ఇక తాను జైలుకు వెళ్లినప్పుడు 70 కిలోలు ఉన్నాననీ.. బయటకు వచ్చే సమయానికి 64 కిలోలు ఉన్నట్లు చెప్పారు. తాను ఇప్పుడు జైలుకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాక ప్రతి తల్లి, సోదరికి ప్రతి నెల రూ.1000 అందించడం ప్రారంభిస్తానని చెప్పారు. అలాగే తాను జైలులో ఉన్నంత మాత్రాన ఏపథకాలు ఆగిపోవని చెప్పారు. ఉచిత విద్యుత్‌, మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులు, ఉచిత మందులు, చికిత్స వంటివి కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. అయితే.. తన తల్లి చాలా అనారోగ్యంగా ఉందనీ.. ఆమె గురించి ఆందోళనగా ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.


Next Story