భరతుడే స్ఫూర్తి.. కేజ్రీవాల్ కోసం కుర్చీ ఖాళీగా ఉంచి మరో సీట్లో కూర్చొన్న అతిషీ
ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిషీ సింగ్ ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 23 Sept 2024 3:45 PM ISTఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిషీ సింగ్ ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అయితే.. సోమవారం తాజాగా అతిషీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం జరిగింది. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కోసం కుర్చీని ఖాళీగా ఉంచారు అతిషీ. పాత కుర్చీని అలాగే ఉంచి.. కొత్త కుర్చీ వేయించుకుని కూర్చొన్నారు. ఈ సందర్భగా సీఎం అతిషీ మాట్లాడుతూ.. రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్తే.. భరతుడు అయోధ్యను పాలించాడు. అప్పుడు ఆయన సింహాసనంపై చెప్పులు ఉంచి పాలించారు. ఇప్పుడు కూడా తాను అదే ఫాలో అవుతున్నానని అతిషీ వివరించారు. మరో నాలుగు నెలల పాటు ఢిల్లీ సీఎంగా పని చేస్తానని చెప్పారు. కేజ్రీవాల్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదని సీఎం అతిషీ సీరియస్ అయ్యారు.
అరవింద్ కేజ్రీవాల్ గౌరవం, నైతికతకు ఉదాహరణగా నిలిచారని ఆమె చెప్పారు. గత రెండేళ్లుగా బీజేపీ పార్టీ కేజ్రీవాల్ ఇమేజ్‌ను దిగజార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉందన్నారు. తప్పుడు కేసులు బనాయించి.. ఆరు నెలల పాటు జైల్లో ఉంచిందని సీఎం అతిషీ అన్నారు. దీంతో ప్రజల్లో తిరిగి విశ్వసనీయత పొందేవరకు సీఎం సీటులో కూర్చోనన్నారు కేజ్రీవాల్. అందుకే రాజీనామా చేశారని ఆమె చెప్పారు.దిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్దే అనీ... దిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. అప్పటివరకు ఈ ఖాళీ కుర్చీ ఈ ఆఫీస్లోనే ఉంటుందనీ.. కేజ్రీవాల్ కోసం ఎదురుచూస్తుందని ఢిల్లీ సీఎం అతిషీ చెప్పారు.