'ఢిల్లీ చలో' మార్చ్‌లో పాల్గొనడానికి వచ్చిన కొంతమంది యువ రైతులు డ్రోన్‌లను అడ్డుకోడానికి గాలిపటాలు ఎగుర వేశారు. నిరసనకారుల గురించి తెలుసుకోడానికి పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రోన్లను గాలి పటాల ద్వారా ఎదుర్కోవచ్చని కొందరు రైతులు భావించారు. పలువురు గాలిపటాలను ఎగురవేస్తూ కనిపించారు. "అంబాలా సమీపంలోని శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ వేయడానికి హర్యానా పోలీసులు ఈ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్ లకు ఆటంకం కలిగేలా గాలిపటాలు ఎగురవేస్తున్నాం" అని యువ రైతు ఒకరు చెప్పారు. డ్రోన్ రెక్కలకు గాలిపటాల దారాలు తగిలితే అవి కూలిపోయే అవకాశం కూడా ఉంది.
రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. గురువారం కేంద్ర ప్రభుత్వం మూడోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపనుంది. వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోం వ్యవహారాల సహాయక మంత్రి నిత్యానంద రాయ్ రైతు నేతలతో సమావేశం కానున్నారు. ఇక శంబు, ఖనౌరీ సరిహద్దుల్లో హర్యానా భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్ షెల్స్, వాటర్ కెనాన్‌లను వినియోగించడాన్ని నిరసిస్తూ ఆ సంఘాలు రైల్‌రోకోకు పిలుపునిచ్చారు.