హోళి వేడుకలపై ఆంక్షలు
Delhi bans public fests of Holi amid daily Covid surge. ఢిల్లీలో కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. హోళి పండగపై ఆంక్షలు విధించింది.
By Medi Samrat
కరోనా కళ్ళముందుకు వచ్చి ముందుకొచ్చి ఏడాది దాటింది.అయినా ఇప్పటికీ దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా దెబ్బకు గత ఏడాది ఇదే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. హోలీ, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ సహా ఏ పండగలూ జరుపుకోలేదు. ఐతే ఈసారి కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా కరోన మళ్లీ విలయతాండవం చేస్తోంది. దీంతో ఈ సంవత్సరమైనా రంగులు పూసుకొని అల్లరి చేద్దామనుకున్న యువత ఆశలపై నీళ్లు చల్లాయి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. హోళి పండగపై ఆంక్షలు విధించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున.. పబ్లిక్ ప్లేసులలో హోళి పండగ సెలబ్రేట్ చేసుకోవద్దని స్పష్టంచేసింది. పండగపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. పండగల సందర్భంగా అందరూ గుమిగూడొద్దని, దీనికి సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.అలాగే ఇతర చోట్ల నుంచి వచ్చేవారికి ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక గుజరాత్ సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 29 జరుగనున్న సామూహిక హోలీ వేడుకలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే హోలీ వేడుకల్లో భాగంగా హోలికా దహనానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ మాత్రమే నిర్వహించుకోవాలని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ స్పష్టం చేశారు. హోలీ సందర్భంగా ప్రజలెవరూ గుంపులు గుంపులుగా ఉండరాదనీ, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోకూడదని స్పష్టం చేసింది.
హోలి పండుగ మార్చి 29న వస్తోంది. దానికి ఒక్క రోజు ముందు హోలికా దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా మంటలు వేస్తారు. చాలా మంది గుమిగూడి ఆడిపాడతారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు పండుగ చాలా సాధారణంగా పెద్దగా సందడి లేకుండా జరగటం ద్వారా కాస్త అయినా కరోనా ని కట్టడి చేయొచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అటు ముంబై, ఒడిస్సా ప్రభుత్వాలు కూడా హోళి సంబరాలపై ఆంక్షలు విధించాయి.