Delhi: బేస్‌మెంట్‌లో కార్యకలాపాలు, 10 కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలను కొనసాగిస్తోంది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 4:45 AM GMTDelhi: బేస్‌మెంట్‌లో కార్యకలాపాలు, 10 కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీలో ఇటీవల ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌కి భారీగా వర్షపు నీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. బేస్‌మెంట్‌లో ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తారంటూ ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలను ప్రారంభించింది. అక్రమంగా బేస్‌మెంట్‌లో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేస్తోంది. అనుమతి లేకుండా సెల్లార్లు, మేస్‌మెంట్లలో నడుస్తున్న పది కోచింగ్ సెంటర్లు, లైబ్రెరీలను మూసివేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాటిని సీజ్ చేసింది. సీజ్ చేసిన ఈ పది కోచింగ్ సెంటర్లు షాహ్‌దారా, కరోల్‌బాఘ్, నజఫ్‌గఢ్ జోన్‌లలో ఉన్నాయని ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబెరాయ్ వెల్లడించారు.
అక్రమంగా కార్యకలాపాల నిర్వహిస్తూ.. విద్యార్థుల సేఫ్టీని పట్టించుకోని కోచింగ్ సెంటర్లకు బుద్ది వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్ఆనమని అధికారులు చెప్పారు. మరోవైపు ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి అతిషీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో బేస్‌మెంట్ నిర్వహిస్తోన్న 30 కోచింగ్ సెంటర్లను మూసివేసినట్లు వెల్లడించారు. దాదాపు 200 ఇనిస్టిట్యూట్‌లకు నోటీసులు కూడా జారీ చేశామన్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అధికారులు, విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. డ్రైనేజీ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.