ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు, ఇండిగో ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు దేశం మొత్తం సర్వం సిద్ధం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 12:09 PM GMTఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు, ఇండిగో ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు దేశం మొత్తం సర్వం సిద్ధం అయ్యింది. అయితే.. పంద్రాగస్టు వేళ ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈక్రమంలోనే ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు జరుగుతున్న సోదాలతో ప్రయాణికులు అసౌకర్యం చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీయ విమానయాన సంస్థ ఇండిగో అడ్వైజరీ విడుదల చేసింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టులలో భద్రతతో పాటు సంబంధిత తనిఖీలు ఎక్కువగా ఉంటాయని ఇండిగో సంస్థ తెలిపింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా అవసరమైన భద్రతా తనిఖీలు పూర్తి చేసేందుకు తగిన సమయం కేటాయించాలని ప్రయాణికులను కోరుతున్నామంటూ ఇండిగో అడ్వైజరీలో పేర్కొంది. మరోవైపు ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఎయిర్‌పోర్టుల్లో జరుగుతున్న తనిఖీల గురించి తమకు సమాచారం ముందుగా ఇవ్వలేదని ప్రయాణికులు చెబుతున్నారు. సడెన్ గా సోదాలు చేస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. తనిఖీలు జరుగుతుండటంతో రద్దీ ఎక్కువ అవుతోందనీ వెల్లడించారు. తాను కూడా ఈ రద్దీలో చిక్కుకుపోయినట్లు ఎడల్‌వీస్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా వెల్లడించారు. సిబ్బంది సహకారంతో సమయానికే విమానం ఎక్కినట్లు తెలిపారు. ప్రయాణికుల ఆందోళన వేళ ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా స్పందించింది. ఆగస్టు 15 సందర్భంగానే తనిఖీలతో సమయం పడుతోందని చెప్పింది. అయితే.. ప్రయాణికులకు ఇబ్బంది కలిగడంపై చింతిస్తున్నామనీ.. కానీ సోదాలు తప్పవని తెలిపింది.