ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. ఊడిపడ్డ పైకప్పు.. కార్లు ధ్వంసం

దేశరాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ఘటన కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on  28 Jun 2024 8:45 AM IST
delhi, airport, roof collapse, six members injured ,

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. ఊడిపడ్డ పైకప్పు.. కార్లు ధ్వంసం

దేశరాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ఘటన కలకలం రేపింది. టెర్మినల్‌ వన్‌ పైకప్పులో కొంతభాగం ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో.. ప్రమాదం సంభవించింది. పైకప్పు కూలి ఒక కారుపై పడిపోయింది. దాంతో.. ఆ కారు ధ్వంసమైంది. మరికొన్ని కార్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరో వ్యక్తి చిక్కుకోవడంతో అతన్ని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఢిల్లీలో భారీ వర్షాలు

ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వరుసగా రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజుల ముందు వరకు భారీ ఎండలతో జనాలు అల్లాడిపోయారు. జూన్‌ నెలాఖరుకి వచ్చినా కూడా ఎండలు దంచికొట్టడం అయోమయానికి గురిచేసింది. అయితే.. వర్షాలు పడటం.. వాతావరణం చల్లగా అవ్వడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు. కానీ.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. వాహనాలు నీటమునిగాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌-1 వద్ద కూలిన పైకప్పు కూడా వర్షం కారనంగా కూలిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఎయిర్‌పోర్టులో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సహాయక చర్యల్లో సిబ్బంది పాల్గొని.. క్షతగాత్రులకు సాయపడ్డామని చెప్పారు. టెర్మినల్ -1 వద్ద ప్రయాణికులకు తగిన ఏర్పాటు చేయాలని.. ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులతో చెప్పానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Next Story